Magazines

వికలాంగుల దినోత్సవం నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.2లక్షలు కేటాయించాలి

13 నిమిషాల క్రితం

Persons with Disabilities.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

రాష్ట్ర స్థాయి ఉత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనాలి : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

వికలాంగుల దినోత్సవం నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రూ.2 లక్షలు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. డిసెంబర్ 3న జరిగే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి ఉత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనాలని ఆయన కోరారు. వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని వేదిక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల శారీరక, మానసిక లోపాలను బట్టి వైకల్య రకాన్ని, వైకల్య శాతాన్ని నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. వికలాంగుల హక్కుల చట్టం-2016 పరిధిలో చేర్చిన ఎనిమిది రకాల వైకల్యాలను ఎలా నిర్ధారించాలో ప్రకటించిందని గుర్తుచేశారు. మానసిక ఆరోగ్యాన్ని మానసిక వైద్యుడి పరీక్ష, ఐడీ యాస్ స్కేల్ ద్వారా అంచనా వేస్తారన్నారు. శాశ్వత ధ్రువీకరణకు కనీసం రెండేండ్ల అనారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. హీమోఫీలియా, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధుల్లో నిర్దేశిత తీవ్రత ఉన్న వారికి 40శాతం బెంచ్ మార్క్ వైకల్యంగా నిర్ణయించాలని మార్గదర్శకాలున్నాయని అన్నారు. పార్కిన్సన్స్, మల్టిపుల్ స్ల్కెరోసిస్ వంటి శారీరక, దృష్టి, వినికిడి, ప్రసంగ, జ్ఞానపరమైన మాసినక, సామాజిక లోపాల ఆధారంగా నాడీ సంబంధిత రుగ్మతలను అంచనా వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వికలాంగుల వివాహ ప్రోత్సాహకం గత మూడేండ్లుగా పెండింగ్ లో ఉన్నాయని అన్నారు తెలిపారు. నిధులు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఖాళీగా ఉన్నా వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గుర్తింపు, స్క్రీనింగ్ కోసం చేపట్టిన ప్రశస్త్ 2.0 వేగంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో 75,76,047 మంది పిల్లలు ఉంటే 33,34,192 మందికి మాత్రమే పార్ట్ 1 స్క్రీనింగ్ పూర్తి అయ్యిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో స్క్రీనింగ్ చేయకుంటే విద్యా సంస్థల్లోని పిల్లలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి.వరమ్మ, రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.యశోద, సహాయ కార్యదర్శి పి.బాలేశ్వర్ పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్