Magazines

నాలుగు లేబర్‌ కోడ్ల రద్దు కోసం సీఐటీయూ సమరశంఖం

7 నిమిషాల క్రితం

labor
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 2 నిమిషాల చదవడం

1న రాంలీలా మైదానంలో
 లక్ష మందితో 
పార్లమెంట్‌ మార్చ్‌

పోలీసుల అనుమతి నిరాకరణ...

ముందుకు సాగాలని నిర్ణయం

కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం, రూ.21 వేల పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కార్మికుల హక్కులు, సంక్షేమ ప్రయోజనాలను హరించే నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ భారీ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిసెంబరు 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో లక్ష మంది కార్మికులు, ఉద్యోగులను సమీకరించి ‘పార్లమెంట్‌ మార్చ్‌’ నిర్వహించనుంది. ఈ మార్చ్‌కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, ముందుకు సాగాలని సీఐటీయూ నాయకత్వం నిర్ణయించింది. పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే డిసెంబరు 2, 3 తేదీల్లో బైటాయించి నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా జరిగే అతిపెద్ద కార్మిక ఉద్యమంగా ఈ మార్చ్‌ నిలవనుంది. నాలుగు లేబర్‌ కోడ్‌లు అమల్లోకి వస్తే స్థిర ఉద్యోగాల విధానం కనుమరుగవుతుందని, కార్మికులు సంఘటితమయ్యే హక్కు, సమ్మె చేసే హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని సీఐటీయూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఏకపక్షంగా ఆమోదించిన ఈ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. బీఎంఎస్‌ మినహా మిగిలిన కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఈ కోడ్‌లను వ్యతిరేకిస్తున్నాయి.

ఇప్పటికే వీటి రద్దు కోసం దేశవ్యాప్త సమ్మెలు సహా అనేక ఆందోళనలు నిర్వహించాయి.
అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించడంతోపాటు గ్రామీణ ఉపాధిని చట్టబద్ధమైన హక్కుగా గుర్తించాలని సీఐటీయూ కోరుతోంది.ఈ చట్టం సమర్థవంతంగా అమలయ్యేందుకు అవసరమైన నిధులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తోంది. వివిధ ప్రభుత్వ పథకాల్లో పని చేస్తున్న ఉద్యోగులను కార్మికులుగా గుర్తించి, భారత కార్మిక సదస్సు (ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌) సిఫారసులను అమలు చేయాలని కోరుతోంది. ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రతతోపాటు సంపూర్ణ కార్మిక హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. ఆరోగ్యం, పోషకాహారం, పాఠశాల విద్యారంగాల్లో కీలక సేవలందిస్తున్న వీరికి అనేక రాష్ట్రాల్లో నెలకు కేవలం రూ.వెయ్యి నుంచి రూ.4,500 వరకే చెల్లిస్తున్నారని పేర్కొంది.

​కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయాలని సీఐటీయూ డిమాండ్‌ చేస్తోంది. సార్వత్రిక పెన్షన్‌ను నెలకు రూ.21 వేలకు పెంచాలని కోరుతోంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని తెలిపింది. పని ప్రదేశాల్లో భద్రతా ఉల్లంఘనలను అరికట్టి, కార్మికుల రక్షణకు అవసరమైన ప్రమాణాలను అమలు చేయాలని, తనిఖీలను ముమ్మరం చేయాలని కోరుతోంది. కార్మికుల చట్టబద్ధమైన హక్కులను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. సంఘటితమయ్యే హక్కు, సమ్మె హక్కులను పరిరక్షించాలని స్పష్టం చేస్తోంది. బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని, ఆదివాసీలు, ఇతర బలహీన వర్గాల జీవనాధారమైన అడవులు, సహజ వనరులపై దాడులు, ఆక్రమణలను అడ్డుకోవాలని సీఐటీయూ కోరుతోంది. జల, భూమి, అడవులతోపాటు ప్రభుత్వ రంగ ఆస్తులను పరిరక్షించాలని పిలుపునిస్తోంది. ఈ డిమాండ్లన్నింటినీ పార్లమెంట్‌ మార్చ్‌తో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సీఐటీయూ నిర్ణయించింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్