ఉత్తర్వులు జారీ చేసిన యాజమాన్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం దిశగా సింగరేణి యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు సింగరేణి పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన కోల్ బెల్ట్ ప్రాంత ప్రజా ప్రతినిధుల సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా సంస్థ ఉచిత విద్యను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని 9 పాఠశాలల్లో చదువుతున్న 400 మందికి పైగా పిల్లలకు తక్షణమే ఇది వర్తించనుంది. వచ్చే సంవత్సరం నుంచి వీరితో పాటు కొత్తగా చేరబోయే కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఈ సౌకర్యం వర్తింపజేస్తారు. ఈ మేరకు సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ అన్ని ఏరియాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సదుపాయాన్ని పొందాలనుకునే కాంట్రాక్టు కార్మికులు తమ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తమ పిల్లల ఆధార్ కార్డు, ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లను సంబంధిత సింగరేణి శాఖాధిపతుల ద్వారా ధ్రువీకరించి సమర్పించాలని సింగరేణి జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.






కామెంట్లు (0)