Magazines

ముగిసిన సందీప్ కుమార్ పర్యటన

17 నిమిషాల క్రితం

Sandeep Kumar's visit has concluded
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 4 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవ హారాల ఇన్ చార్జి బి.ఎం.సందీప్ కుమార్ మూడు రోజుల రాష్ట్ర పర్యటన విజయవంతంగా ముగి సింది. కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులతో వేర్వేరుగా ముఖా ముఖీగా ఆయన సమీక్షించారు. 22న రాష్ట్రానికి వచ్చేసిన ఆయనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ సభ్యులు ఘన స్వాగతం పలి కిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆయన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, సలహా కమిటీ, పీసీసీ విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. 23న మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మెన్లతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఇటీవల ఆ ఇరువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారితో భేటీ కావడం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నెల 26న రాష్ట్రానికి తిరిగి రానున్న సందీప్ కుమార్ హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్న సంవిధాన్ రక్షా మార్చ్ లో పాల్గొననున్నారు. 27న సందీప్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు.

​రేపు సంవిధాన్ రక్షా మార్చ్

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26న సంవిధాన్ రక్షా మార్చ్ పేరుతో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం ఉదయం 10.30 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనలో ఏఐసీసీ ఇన్ చార్జి బి.ఎం సందీప్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.

​విషయ పరిజ్ఞానం లేని నితిన్ నబీన్ : మంత్రి పొన్నం ప్రభాకర్

బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ మాటల్లో శబ్ద కాలుష్యమే తప్ప విషయ పరిజ్ఞానం లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల తొలగింపులు, ఎన్నికల డేటా మార్పులు, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బీజేపీకి ఉందా?, ఓటర్ల జాబితాను మెషిన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఎందుకు అందించడం లేదు? ఎన్నికల డేటా అందుబాటులో లేకుండా చట్ట సవరణలు ఎందుకు? సర్ పై పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చించడానికి బీజేపీ ఎందుకు భయపడుతోంది?, చొరబాట్లు జరగకుండా కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చొరబాటుదారుల పేరుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన నితిన్ నబీన్ తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రజల కనీస అవసరాల గురించి మాట్లాడలేదని ఆయన తప్పుపట్టారు. ఓట్ల తొలగింపుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారని ఆయన గుర్తుచేశారు. పలు రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపునకు సంబంధించి రాహుల్ గాంధీ ఆధారాలను బయటపెట్టారని తెలిపారు. 12 ఏండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా భావోద్వేగాలు, విద్వేష రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు సాగవని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.

​కృష్ణా జలాలపై హరీశ్ రావు, కేటీఆర్ తప్పుడు ప్రచారం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కృష్ణా జలాలపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ, టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ కమిటీ చైర్మెన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలే దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం చేకూర్చాయని చామల విమర్శించారు. 2013లో జూరాల నుంచి నీరు తీసుకునేలా జీవో 72 రాగా, 2015లో జీవో 105 ద్వారా ప్రాజెక్టు సోర్స్‌ను శ్రీశైలానికి మార్చడంతో లిఫ్టులు, పంపులు పెరిగి ప్రాజెక్టు అంచనా రూ.30 వేల కోట్ల పైచిలుకు నుంచి రూ.80 వేల కోట్ల పైచిలుకు చేరినా, ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఎండగట్టారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను కూడా నిర్లక్ష్యం చేశారని, 2014కు ముందు ఉన్న సుమారు 80 వేల ఎకరాల భూసేకరణ తప్ప బీఆర్ఎస్ హయాంలో పెద్దగా భూసేకరణ చేయలేదని నిలదీశారు. కృష్ణా జలాల్లో 2015లోనే 299 టీఎంసీల తాత్కాలిక పంపిణీకి అంగీకరించారని ఆరోపించారు. 2019, 2020లలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ప్రగతిభవన్ సమావేశాలు, విందు భేటీల చేశారన్నారు. ఆ తర్వాత 2020లో రాయలసీమ లిఫ్ట్ జీవో 203 వచ్చినప్పుడు, 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు వాటర్ గ్రిడ్‌కు సంబంధించిన జీవో 56 కూడా 2022 ఫిబ్రవరి 16నే వచ్చిందని, అన్ని విషయాలు కాగితాల మీద ఉన్నప్పటికీ ఇప్పుడే ప్రారంభమైనట్టు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అభ్యంతరం తెలిపారు. పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదా సాధించేందుకు నిరంతరం ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని కోరారు.

రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుంటే బీజేపీ ఎంపీల మౌనం ఎందుకు? : డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్

కేంద్రంలో ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందునే కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు ఏపీకి వత్తాసు పలుకుతున్నాయని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుంటే రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన వాటాకు మించి ఇప్పటికే వాడుకున్న ఏపీ నాగార్జున సాగర్ నుంచి అదనంగా 9 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీపై ఒత్తిడి తీసుకొస్తున్నదని ఆయన ఖండించారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు గ్రేటర్ హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు, మూగజీవాల తాగునీటి అవసరాలకే సరిపోతాయని తెలిపారు. ఏపీకి పులిచింతల ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ సాగర్ నుంచి నీళ్లను అడగటం రాజకీయ కుట్ర అని ఆరోపించారు. సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తోడుకునేలా ఏపీ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ అక్రమ పనులను తక్షణమే నిలిపి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తప్పిదాలతోనే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. ఏపీకి సాగర్ నుంచి ఒక్క చుక్క నీరు అదనంగా ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్