ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రూ.10 వేల కోట్ల కార్యాచరణ
కరువు తట్టుకునే నమూనాలు, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయంపై ప్రధానంగా చర్చ : క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ కేవలం సిద్ధాంతపరమైన చర్చలకే పరిమితం కాకుండా, వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లకు ఆచరణాత్మకంగా అమలు చేయగల, శాస్త్రీయంగా నిరూపితమైన పరిష్కారాలను సూచించే వేదికగా నిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. కరువును తట్టుకునే వ్యవస్థల నిర్మాణం, నీటి భద్రత, సుస్థిర వ్యవసాయం, ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలపై కాంక్లేవ్‌లో లోతైన చర్చ జరగాలని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహిస్తున్న క్లైమేట్ కాంక్లేవ్ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీ ట్రాన్స్‌కో సీఎండీ డి. కృష్ణభాస్కర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన వాతావరణ అనుకూల నమూనాలతోపాటు ఇక్రిశాట్ గుర్తించిన ఉత్తమ విధానాలను ప్రదర్శనలు, ఆడియో–విజువల్ కార్యక్రమాల్లో సమగ్రంగా పొందుపరచాలని సూచించారు. సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ బృహత్తర కార్యక్రమంలో సంక్రాంతి తరువాత ప్రతి నెలా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పనులను అమలు చేయాలని ప్రతిపాదించారు.
నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో చెరువులు, వాగులు, కాలువల పునరుద్ధరణ, భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపు నీటి సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల పరిరక్షణకు సంబంధించిన పనులను విస్తృతంగా చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు దాదాపు ఏడాదిపాటు సరిపడే బియ్యం నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని డేటా సెంటర్లు తమ మొత్తం విద్యుత్ అవసరాల్లో కనీసం 51 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి సమకూర్చుకోవాలనే నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని అధికారులు వివరించారు.
పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ క్రెడిట్లు, పర్యావరణ పర్యాటకం, వ్యర్థాల పునర్వినియోగంతో కూడిన సర్క్యులర్ ఎకానమీ రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు ప్రత్యేక పెట్టుబడిదారుల వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర అభివృద్ధిలో తెలంగాణను దేశానికి మార్గదర్శకంగా నిలపాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఈ కాంక్లేవ్ మరింత బలోపేతం చేయనుందన్నారు.






కామెంట్‌లు (0)