Magazines

కార్ల ధరలకు మళ్లీ రెక్కలు

10 నిమిషాల క్రితం

Car prices soar once again
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

టాటా, హ్యుందాయ్‌ బాదుడు

ఆడి కార్లు మరింత ప్రియం

న్యూఢిల్లీ : పెరుగుతోన్న ముడిసరుకు, ఉత్పాదక వ్యయాల భారాన్ని ఆటోమొబైల్‌ ‌కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేస్తోన్నాయి. ఇటీవల మారుతీ సుజుకీ ధరల సవరణ చేపట్టగా.. తాజాగా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌, హ్యుందాయ్‌ మోటార్‌, ఆడి కూడా ధరల పెంపును ప్రకటించాయి. టాటా మోటార్స్‌ తన మొత్తం కార్లు, ఎస్‌‌యువిల శ్రేణిపై సగటున 0.5 శాతం ధరలను పెంచనుంది. కొత్త ధరలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఆ కంపెనీ మంగళవారం వెల్లడించింది.

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (టిఎంపివి) తన పెట్రోల్‌, డీజిల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలపై పెంపును అమలు చేయనున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ముడి సరుకుల వ్యయాల ప్రభావాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది. వ్యయాల పెరుగుదలలో పెద్ద మొత్తంలో కంపెనీ భరిస్తున్నప్పటికీ.. కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సి వస్తోందని పేర్కొంది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు మారనుంది.

డిసెంబర్‌ 1 నుంచి హ్యుందాయ్‌ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను గరిష్ఠంగా రూ.8,000 వరకు పెంచనుంది. ముడిసరుకు, తయారీ వ్యయాల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారత్‌లో తన వాహన శ్రేణి ఎక్స్‌షోరూం ధరలను గరిష్ఠంగా 2 శాతం పెంచనుంది. ఈ పెంపు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఆటోమొబైల్‌ కంపెనీలు పెరుగుతున్న ముడిసరుకు ధరలు, ఇతర ఉత్పాదక వ్యయాల ఒత్తిడిని పూర్తిగా భరించలేక ధరల పెంపును చేపడుతున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరిన్ని ఆటో కంపెనీలు కూడా ధరల సవరణను చేపట్టడానికి కసరత్తు చేస్తోన్నాయని పేర్కొన్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్