నారాయణ స్కూల్స్‌లో ఘనంగా ‘మాస్టర్ ఆరేటర్ - సీజన్ 7’
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నారాయణ స్కూల్స్ తమ ‘లైఫ్ స్కిల్స్’ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రతిష్టాత్మక ‘మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ - సీజన్ 7’ను ఘనంగా నిర్వహించింది. విద్యార్థుల సమగ్ర వికాసం, వారిలో నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించే లక్ష్యంతో వక్తృత్వ సామర్థ్యం, విమర్శనాత్మక ఆలోచన (క్రిటికల్ థింకింగ్), సమర్థవంతమైన భావవ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసాన్ని విద్యార్థులలో పెంపొందించడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. పోటీలను రెండు విభాగాల్లో (1 నుంచి 5వ తరగతి మరియు 6 నుంచి 9వ తరగతి) నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి విభాగంలో 2,600 మందికి పైగా విద్యార్థులు పోటీ పడగా, 84 మంది గ్రాండ్ ఫినాలేకి ఎంపికయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 18 మంది విజేతలకు బహుమతులు అందజేశారు.
(ఆరుగురు విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, ఐదుగురు విద్యార్థులు ద్వితీయ స్థానం, ఏడుగురు విద్యార్థులు తృతీయ స్థానాలు సాధించారు). 6 నుంచి 9వ తరగతి విభాగం ప్రిలిమినరీ రౌండ్లో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని 12 బ్రాంచీల నుంచి 3,500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఫైనల్స్‌కు చేరిన 96 మందిలో 34 మంది విజేతలుగా నిలిచారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, 12 మంది విద్యార్థులు ద్వితీయ స్థానం, 14 మంది విద్యార్థులు తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థుల ప్రసంగాలను కంటెంట్, సృజనాత్మకత, ప్రెజెంటేషన్, కమ్యూనికేషన్ నైపుణ్యాల ఆధారంగా న్యాయ నిర్ణేతలు విజేతలను నిర్ణయించారు.
ఈ పోటీల్లో విద్యార్థులు “ఇంటర్నెట్ లేని జీవితం”, “పాఠ్య ప్రణాళికలో కళలు, సంగీతం ప్రాముఖ్యత”, “మెరుగైన పాఠశాల కోసం నా ఆలోచనలు”, “చిన్న మార్పులే పెద్ద ఫలితాలకు నాంది”, “గ్లోబలైజేషన్: ప్రపంచం ఎలా అనుసంధానమైంది” వంటి సమకాలీన, ఆలోచింపజేసే అంశాలపై అద్భుతంగా ప్రసంగించారు. విద్యార్థులు తమ సొంత ఆలోచనలను నిర్భయంగా పంచుకోవడానికి, వేదికపై ధైర్యంగా మాట్లాడే కళను అలవర్చుకోవడానికి ఈ ‘మాస్టర్ ఆరేటర్’ వేదిక ఎంతగానో దోహదపడిందని నారాయణ విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ పి. సింధూర నారాయణ తెలిపారు. నారాయణ స్కూల్స్‌లో ప్రతి విద్యార్థి తన గొంతును సవరించుకుని, దానిని అర్థవంతంగా వినిపించే ధైర్యాన్ని పొందాలని ఆకాంక్షించారు. మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ కేవలం ప్రసంగం గురించి మాత్రమే కాదు, అది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, స్పష్టతను పెంచే ఒక ప్రయాణంగా అభివర్ణించారు. పిల్లలు తమ ఆలోచనలను ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేసినప్పుడు, వారు తమ కలలకు ఒక అడుగు దగ్గరవుతారని నారాయణ విద్యాసంస్థ నమ్ముతోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు యాజమాన్యం అభినందనలు తెలియజేసింది.






కామెంట్లు (0)