వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి విధానం : సీఎం
వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి విధానం
బోధనా సిబ్బంది ప్రయోజనాలకు భంగం కలగనివ్వం
విద్యా సంస్థల్లో మౌలిక వసతులకు పెద్దపీట
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు నాణ్యమైన విద్యా బోధన ద్వారా, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ)లో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ప్రగతిని అధికారులు వివరించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు.
12వ తరగతి వరకు విద్యార్థులను భాషా, సమాచార నైపుణ్యాలపై పూర్తి పట్టు సాధించేలా తీర్చిదిద్దాలని కోరారు. 12వ తరగతి తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అందులో నిపుణులుగా మారేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలని సూచించారు.
పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారనీ, అందులో అత్యధికులు బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలే ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 12వ తరగతి వరకు కొనసాగింపు ఉన్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డ్రాపౌట్స్ సంఖ్య చాలా స్వల్పంగా ఉంటోందని చెప్పారు. దేశంలో 18 రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు విధానమే అమల్లో ఉందని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలల్లోని లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, రిటైర్‌మెంట్ బెనిఫిట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని సీఎం అన్నారు. ఆయా వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూళ్లను పూర్తి వసతులతో నిర్మించడానికి అవసరమైన కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని అధికారు లను ఆదేశించారు. వాటి నిర్మాణాలకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్స్ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలనీ, వాటికి పూర్తి స్థాయిలో నీటి వసతి కల్పించాలని సీఎం ఆదేశించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలనీ, నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తిచేయాలని ఇంజినీ రింగ్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిం చారు. ఆయా స్కూళ్లలో ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటు, ఇంటీరియర్, డిజిటల్ పరికరాలు, క్రీడా పరికరాలు, కిచెన్ సామగ్రి సేకరణకు సంబంధించి అత్యుత్తమ సంస్థలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏ దశలోనూ నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు. క్యూర్ పరిధిలో స్కూళ్ల నిర్మాణాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటే వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీఐలను ఏటీసీలుగా అప్డేట్ చేసిన తర్వాత విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు వాటిలో శిక్షణ పొందిన వారందరికీ ఉద్యోగాలు లభించాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్‌ల అప్‌డేట్‌కు అవసరమైన నిధుల విడుదలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో శాఖపరమైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి చైర్మెన్, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్, పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు నవీన్ నికోలస్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, టీజీఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)