వెంటనే యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి : యూటీఏసి-టీజీ సమావేశంలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని అబ్సర్బ్ చేయాలనీ, వెంటనే యూజీసీ పే స్కేల్ అమలు చేయాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (కాంట్రాక్ట్) తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఆల్ పార్టీ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాల్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల చేస్తున్న డిమాండ్లలో న్యాయముందని తెలిపారు. రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న 1,230 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ అబ్సర్బ్ చేయాల్సిందేనన్నారు.
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఇప్పటికే విద్యా కమిషన్, ఉన్నత విద్య, ప్రభుత్వ అధికారులను పలుమార్లు కలిసినప్పటికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లకు ప్రత్యేకంగా పే రివిజన్ చేయడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం అసోసియేషన్ చేపట్టే కార్యాచరణలో తాను భాగస్వామిని అవుతానని తెలిపారు.
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్లు నెరవేరకుండా అడ్డుగా ఉన్న యూజీసీని ప్రక్షాళన చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీల వీసీలు సీఎంకు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తోనే సమస్యలు వస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికే సమస్యను టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లాననీ, సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. విద్యావ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనీ, కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో విలీనం చేశారనీ, అది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం ఉండాలన్నారు. విలీనానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయంతో పాటు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3 వేల అధ్యాపక పోస్టుల్లో 1,200 కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసిన తర్వాత మిగిలిన 1,800 పోస్టులన్నింటిని భర్తీ చేయాలని సూచించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు డాక్టర్ పరశురాములు, డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్, డాక్టర్ రామేశ్వరరావు, డాక్టర్ కర్ణాకర్, డాక్టర్ నిరంజన్, సురేష్ నాయక్, డాక్టర్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)