మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితుల అరెస్ట్
రూ 1.73 కోట్ల విలువలైన బంగారం, వెండి, నగదు, కారు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ అక్షాంశ్‌యాదవ్
నవతెలంగాణ–చౌటుప్పల్
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో అక్టోబర్ 31వ తేదీ అర్ధరాత్రి జరిగిన జోగిని రాళ్లబండి సుధాకర్ స్వామి హత్య కేసును చౌటుప్పల్ పోలీసులు 3గంటల్లోనే ఛేదించారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో ఎస్పీ అక్షాంశ్‌యాదవ్, డీఎస్పీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్, హర్ష్ సంతోష్ పాండే అక్టోబర్ 31వ తేదీ రాత్రి జోగిని సుధాకర్ స్వామి ఇంటికి వచ్చారు. సుధాకర్ చేతులు, కాళ్లను చీరలతో కట్టేసి కత్తితో పొడిచి చంపారు. అనంతరం ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకుని టాటా సఫారీ కారులో పరారయ్యారు. అర్ధరాత్రి మృతుని ఫోన్ నుంచి మేనల్లుడు గుర్రం సురేష్‌కు వాట్సప్ వాయిస్ మెసేజ్‌లు రావడంతో వెంటను అతను ఇంటికి వెళ్లి పరిశీలించాడు. కారు కనిపించకపోవడంతో ఈనెల 1వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 1.36 గంటలకు డయల్ 112కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న సుధాకర్ స్వామి మృతదేహాన్ని గుర్తించారు. సురేష్ ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 609/2026 కింద హత్య, దోపిడీ తదితర సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఎస్పీ, డీఎస్పీ ఆదేశాలతో రెండు జిల్లాల పోలీస్ బృందాలు కారు నెంబర్, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించాయి. ఎన్‌హెచ్-44పై టోల్ ప్లాజాలను అప్రమత్తం చేయడంతో.. అదే రోజు తెల్లవారుజామున 4.05 గంటలకు నిర్మల్ జిల్లా గంజాల్ టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్, హర్ష్ సంతోష్ పాండేగా గుర్తించారు. వారి నుంచి కిలో 319.33 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల 600.66 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.9,03,300, రూ.30 లక్షల టాటా సఫారీ కారు, మూడు మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.1.73 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ డి.సతీష్ రెడ్డి, సీసీఎస్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐలు కనకటి యాదగిరి, రవీందర్, అజయ్ భార్గవ్, చౌటుప్పల్ పోలీసులు, నిర్మల్ జిల్లా పోలీసులను ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అభినందించారు.






కామెంట్‌లు (0)