కార్మికుల ప్రయోజనాలు కాపాడే సీఐటీయూనే గెలిపించండి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లికార్జున్
నవతెలంగాణ-తూప్రాన్/మనోహరాబాద్
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయిపల్లి పరిధిలోని ఇండస్ మెడికేర్ పరిశ్రమలో నవంబర్ 3 న జరిగే గుర్తింపు ఎన్నికల్లో అనైతిక పొత్తులను ఓడించి కార్మిక ప్రయోజనాలు కాపాడే సీఐటీయూకు చుక్క గుర్తు పై ఓటేసి గెలిపించాలని యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన గేట్ మీటింగ్ లో మల్లికార్జున్ హాజరై ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఆర్టీయూ అనైతిక పొత్తుతో కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు.
ఏనాడూ కార్మికుల హక్కుల కోసం పోరాడని, కనీసం కార్మిక చట్టాలు కూడా తెలియనివారు కార్మిక సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడం అంటే కార్మికులను మోసం చేయడం అని అన్నారు. కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం, ఉద్యోగ భద్రత, కోసం సీఐటీయూ కృషి చేస్తుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక పరిశ్రమల్లో వేతన ఒప్పందాలు చేసిన చరిత్ర సీఐటీయూ దే అన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయిస్తున్న చరిత్ర సీఐటీయూదే అన్నారు. కాంట్రాక్ట్, క్యాజువల్ కార్మికుల కనీస వేతనాల పెంపుదల, కోసం సీఐటీయూ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలేష్, నాయకులు సుజాత, తిరుపతి, రమేష్, రాజేశ్వరి, పూర్ణేశ్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)