సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో పని చేస్తున్న హౌస్‌కీపింగ్, సెక్యురిటీ గార్డులకు జీవో నెంబర్ 6 ప్రకారం వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, కోశాధికారి వంగూరు రాములు, కార్యదర్శులు కూరపాటి రమేష్, పి శ్రీకాంత్ ప్రతినిధి బృందం డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్(డిఐఎంఎస్) హరిచందన, జేసీఎల్ గంగాదర్ కు వినతిపత్రం అందజేశారు. ఈఎస్ ఐ ఆస్పత్రుల్లో పారిశుధ్య కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు రేట్లు పెంచిన ప్రభుత్వం, కార్మికులకు కూడా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం. 6 ప్రకారం కనీస వేతనం స్వీపర్లకు (అన్‌స్కీల్డ్)కు రూ.16వేలు, సెక్యూరిటీ గార్డులు (సెమీస్కిల్డ్)కు రూ.17వేలు వేతనం చెల్లంచడంతో పాటు పెరిగిన సీపీఐ (కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ప్రకారం వీడీఏని కూడా కలిపి మొత్తం వేతనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 26లక్షల మంది ఐపీలు, కోటి మంది లబ్దిదారులు ఉన్నారని తెలిపారు. వారంతా కార్మికులు, ఉద్యోగులేనని పేర్కొన్నారు. వారి అవసరాలకు అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. నిత్యామసరమైన మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)