Magazines

‌కరువులో మూసీ సుందరీకరణ ఎందుకు?

1 గంట క్రితం

Musi
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 3 నిమిషాల చదవడం

రూ.లక్షన్నర కోట్లు రైతుల కోసం వినియోగించాలి

డీపీఆర్‌ లేకుండా లూటీ చేసేందుకు కుట్ర

కాంగ్రెస్‌ ప్రభుత్వానికే హాలిడే ప్రకటించాలి

అది గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు... గోబెల్స్‌ సమ్మిట్‌

అభినవ నీరో చక్రవర్తి సీఎం రేవంత్‌‌రెడ్డి :
 బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఎల్‌‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో 365 మండలాల్లో కరువుందని ప్రభుత్వం ఒకవైపు ప్రకటించి ఇంకోవైపు మూసీ సుందరీకరణకు పూనుకోవడం ఎంత వరకు సమంజసమని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె తారక రామారావు (కేటీఆర్‌) ప్రశ్నించారు. కరువులో మూసీ సుందరీకరణను వాయిదా వేసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. రూ.లక్షన్నర కోట్లను ప్రజలు, రైతులను ఆదుకోవడానికి వినియోగించాలని సూచించారు. గురువారం హైరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి కొరత, కరెంటు లేక పంటలు ఎండిపోతుంటే మూసీ సుందరీకరణ ఎందుకని ప్రశ్నించారు. డీపీఆర్‌ ‌లేకుండా రూ.లక్షన్నర కోట్లు లూటీ చేసేందుకు సీఎం రేవంత్‌‌రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడమేంటని నిలదీశారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్‌అరెస్టుతోపాటు

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, ఎమ్మెల్యే డి సుధీర్‌‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ‌నాయకులు కార్తీక్‌‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. రోమ్‌ ‌నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ ‌వాయించినట్టుగా కరువుతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం రేవంత్‌‌రెడ్డి మూసీ సుందరీకరణకు పూనుకుంటున్నారని అన్నారు.

అభినవ నీరో చక్రవర్తి రేవంత్‌‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో వేలాది ఎకరాల భూమిని లూటీ చేసేందుకే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని ఆరోపించారు. కరువుతో ప్రజలు, అన్నదాతలు అల్లాడుతుంటే మల్లన్నసాగర్‌ ‌నుంచి పది టీఎంసీల నీటిని మూసీలోకి తేవాలనుకోవడం ఎంత వరకు సమంజసమని అడిగారు. ఏవి అడిగినా నిధుల్లేవంటున్న ప్రభుత్వానికి మూసీ సుందరీకరణకు నిధులెక్కడివని ప్రశ్నించారు. క్రాప్‌ ‌హాలిడే, పవర్‌ ‌హాలిడే, ఆరు గ్యారంటీలకు హాలిడే, 420 హామీలకు హాలిడే, పీఆర్సీ హాలిడే, డీఏల హాలిడే, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌ ‌హాలిడే అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు హాలిడే ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగం నడుస్తోందా?, ఎనుముల రాజ్యాంగం నడుస్తోందా?అని ప్రశ్నించారు. గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 250 టీఎంసీలు కలిపి వెయ్యి టీఎంసీల నీటిని ఒడిసిపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కిందికి వదిలిపెట్టిందని చెప్పారు. తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం నమోదైన ఏపీ, కర్నాటకలో కరువు లేదన్నారు. పట్టిసీమ వద్ద 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసిన ఏపీ సీఎం చంద్రబాబును అభినందిస్తున్నానని చెప్పారు. క్రాప్‌ ‌హాలిడే, పవర్‌ ‌హాలిడేకు కారణం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని విమర్శించారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, కాంగ్రెస్‌ ‌తెచ్చిన కరువని అన్నారు.

నిజం నిలకడగా తేలుతుంది

నిజం నిలకడగా తేలుతుందని కేటీఆర్‌ అన్నారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంపై ఆయన స్పందించారు. ఇటీవల ఓ పత్రిక, ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. ఫార్ములా ఈ కారు రేసు, ఫోన్‌ ‌ట్యాపింగ్‌, విద్యుత్‌ కుంభకోణం వంటివి కూడా తప్పుడు ఆరోపణలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు ఏ జీవన్‌‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, నాయకులు లక్ష్మారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, రాకేశ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.


పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించాలి

డిసెంబర్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది గ్లోబల్ సమ్మిట్ కాదనీ, గోబెల్స్ సమ్మిట్ అని కేటీఆర్‌ విమర్శించారు. కరువులో ఈ సమ్మిట్ ఎందుకనీ, కరెంటు, నీళ్లు లేవని పెట్టుబడిదారులకు చెబుతారా?అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో ఎలాంటి గ్లోబల్ సమ్మిట్లు పెట్టకుండానే పదేండ్లలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వివరించారు. మూడేండ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలతో చేసుకున్న ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో 9.46 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తే ప్రస్తుతం 9.39 లక్షలకు పడిపోయారని వివరించారు. అంటే ఐటీ ఉద్యోగుల సంఖ్య ఏడు వేలు తగ్గిందని ప్రభుత్వమే అంగీకరించింద న్నారు. రైతులకు నాలుగు విడత రైతుభరోసా నిధులను ప్రభుత్వం ఇవ్వలేదనీ, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదనీ, కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదనే దాన్ని ఈ ప్రభుత్వం నిరూపించిందని చెప్పారు. రాహుల్‌‌గాంధీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, కరువు కాటకాలు, పరిపాలనా వైఫల్యం ఉన్నా రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్