నవతెలంగాణ – హైదరాబాద్ : లడఖ్ ప్రజలతో చర్చలు జరపాలని కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ మంగళవారం కేంద్రాన్ని కోరారు. ఈ సందర్బంగా హింసను ప్రేరేపించే, భయపెట్టే రాజకీయాలను ఆపమని కేంద్రాన్ని రాహుల్ కోరారు. లడఖ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై నిష్పక్షపాత న్యాయవిచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. మరణించిన వారిలో సైనికుల కుటుంబానికి చెందిన వారు కూడా ఉన్నారని రాహుల్ ఎత్తిచూపారు.
‘తండ్రి సైనికుడు. కొడుకు కూడా సైనికుడే. వారి రక్తంలో దేశభక్తి ప్రవహిస్తోంది. అయినప్పటికీ లడఖ్ కోసం, అతని హక్కుల కోసం నిలబడినందుకు బిజెపి ప్రభుత్వం ధైర్యవంతుడైన కొడుకుని కాల్చి చంపింది. ఆ తండ్రి కళ్లు కన్నీరుకారుస్తూ ఒకే ఒక ప్రశ్నను అడుగుతున్నాయి. దేశానికి సేవ చేసినందుకు ఈరోజు దక్కిన ప్రతిఫలం ఇదేనా?అని.. లఖడలో బిజెపి చేసిన ఈ హత్యలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దోషులకు కఠినమైన శిక్ష విధించాలి. మోడీజీ మీరు లడఖ్ ప్రజలను మోసం చేశారు. లడఖ్ ప్రజలు తమ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నారు. మీరు ఇప్పటికైనా హింసను, భయపెట్టే రాజకీయాలను ఆపండి’ రాహుల్ తన ఎక్‌స పోస్టులో పేర్కొన్నారు.