Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంబీజేపీ ఓటమికి వ్యూహ రచన

బీజేపీ ఓటమికి వ్యూహ రచన

- Advertisement -

– అన్ని పక్షాలు సమన్వయంతో పనిచేయాలి : బీహార్‌ ఎన్నికలపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
పాట్నా:
రాబోయే బీహార్‌ శాసనసభ ఎన్నికలలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు సమన్వయంతో కూడిన వ్యూహాన్ని రూపొందించుకోవాలని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పిలుపునిచ్చారు. సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆయన సోమవారం తొలిసారి బీహార్‌ వచ్చారు. రాష్ట్రంలో మహా కూటమికి జవసత్వాలు కల్పించేందుకు వామ పక్షాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన పాట్నా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పాట్నా విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో బీజేపీని మట్టికరిపించాలంటే మహాకూటమి భాగస్వామ్య పక్షాలు కలసికట్టుగా వ్యూహాన్ని రూపొందించు కోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ‘బీహార్‌లో రానున్న కీలక ఎన్నికలలో బీజేపీని ఎలా ఓడించాలి, మహాగట్‌బంధన్‌ను ఎలా బలోపేతం చేయాలి అనే విషయాలపై మా పార్టీ నాయకులతో చర్చలు జరుగుతాయి. ఈ చర్చల ఫలితాలను మేము మీడియాకు తెలియజేస్తాము’ అని బేబీ అన్నారు. వామపక్ష పార్టీలు దేశవ్యాప్త ఆందోళనకు ప్రణాళికలు రూపొందిస్తున్న తరుణంలో బేబీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. కార్మికుల హక్కులకు మద్దతుగా ఈ నెల 20న వామపక్ష పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. మహా కూటమి ఐక్యతను, దాని రాజకీయ బల ప్రదర్శ నను ఈ బంద్‌ చాటిచెప్పబోతోంది. ఆదివారం జరిగిన మహాగట్‌బంధన్‌ సమావేశంలో బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ (ఎంఎల్‌) నేత దీపాంకర్‌ భట్టాచార్య తెలిపారు. వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ చెప్పారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత డాక్టర్‌ షకీల్‌ అహ్మద్‌ ఖాన్‌ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని దుయ్యబట్టారు. నితీష్‌ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. కాగా బీహార్‌లో ప్రతిపక్ష కూటమి కార్యాచరణ ప్రణాళికకు రూపం ఇచ్చే విషయంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అందులో భాగంగానే సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి బేబీ పర్యటనను చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad