నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పై వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో చిన్నారి ఓ కన్ను కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్ నగర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన జనార్ధన్, జ్యోతి దంపతుల కుమారుడు రిత్విక్ (3) ఇంటి ముందు ఆడుకుంటుండగా గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు చిన్నారి పై దాడి చేసి గాయపరిచాయి. దాడిలో గాయపడిన రిత్విక్ ను చికిత్స నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల దాడిలో చిన్నారి రిత్విక్ ఎడమ కంటికి తీవ్రగాయం కావడంతో హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
రిత్విక్ కు శస్త్రచికిత్స నిర్వహించినా లాభం లేకుండా పోయిందని, చిన్నారి కన్ను కోల్పోయాడని వైద్యులు తెలిపారని గ్రామస్తులు పేర్కొన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కలను పట్టుకుని తమ గ్రామంలో వదలడంతోనే ఈ సమస్య నెలకొందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పెద్దలు సైతం ఒంటరిగా గ్రామంలో తిరిగేందుకు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల దాడిలో కన్ను కోల్పోయిన రిత్విక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వీధి కుక్కలను అరికట్టి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.



