నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో వీధి కుక్కలను పట్టుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలించాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలు బహిర్గతం కాకముందే అధికారులు వాటిని పట్టుకోవడం ఎలా మొదలుపెట్టారని ధర్మాసనం ప్రశ్నించింది. జంతు నియంత్రణ మార్గదర్శకాలను సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని అధికారుల తీరుపై మండిపడింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆగస్టు 11న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఢిల్లీలో పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుమోటోగా స్పందిస్తూ, వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై జంతు ప్రేమికులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కుక్కకాటు వల్ల చిన్నారులు చనిపోతున్నారని, రేబిస్ కేసులు పెరుగుతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. “గతేడాది దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. స్టెరిలైజేషన్ చేస్తే రేబిస్ ఆగదు. కుక్కలను చంపాల్సిన అవసరం లేదు. వాటిని వేరుగా ఉంచాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపలేని పరిస్థితి ఉంది” అని ఆయన వాదించారు.
జంతు సంక్షేమ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, అసలు ఢిల్లీలో తగినన్ని షెల్టర్ హోమ్స్ లేనప్పుడు కుక్కలను ఎక్కడికి తీసుకెళ్తారని ప్రశ్నించారు. “షెల్టర్ హోమ్స్ లేనప్పుడు ఈ ఉత్తర్వులు ఎలా వర్తిస్తాయి? కుక్కలను ఒకేచోట బంధిస్తే అవి ఒకదానిపై ఒకటి దాడి చేసుకుని చనిపోయే ప్రమాదం ఉంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కూడా మౌలిక సదుపాయాల కొరతను ప్రస్తావించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ విక్రమ్ నాథ్, పార్లమెంటు చట్టాలు చేసినా అధికారులు వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఒకవైపు మనుషులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. దీనికంతటికీ అధికారుల వైఫల్యమే కారణం” అని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ కేసులో తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు ప్రకటించింది.