రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో స్పెషన్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్)-2026 ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధం అయి ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈ.ఆర్.ఓలతో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై సన్నాహక సమావేశం జరిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) నుండి ఆదేశాల అందిన వెంటనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీ.ఈ.ఓ సూచించారు. బిహార్ రాష్ట్ర సాధారణ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పూర్తయ్యిందని గుర్తు చేశారు. తెలంగాణాలో సైతం ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా సన్నద్ధం కావాలన్నారు. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను సరిపోల్చుకోవాలని సూచించారు.
ఎస్.ఐ.ఆర్ నిర్వహణపై సూపర్వైజర్లు,బీ.ఎల్.ఓలకు శిక్షణలు అందించాలని అన్నరు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.