Thursday, May 1, 2025
Homeఅంతర్జాతీయంఆర్థిక, సామాజికాభివృద్ధికిపటిష్ట ప్రణాళికలు

ఆర్థిక, సామాజికాభివృద్ధికిపటిష్ట ప్రణాళికలు

– మారుతున్న కాలానికి తగినట్టుగా కార్యాచరణ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపు
బీజింగ్‌ : మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా మనం కూడా మారాల్సి వుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బుధవారం పేర్కొన్నారు. అంతర్జాతీయ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాల్సి వుందని పిలుపిచ్చారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలను అర్ధం చేసుకుని, వచ్చే ఐదేండ్లకు (2026-2030) దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాల్సి వుందని పేర్కొన్నారు.
14వ పంచవర్ష ప్రణాళిక (2021-2025)లో నిర్దేశిం చుకున్న లక్ష్యాలను పూర్తి చేయడానికి చివరి సంవత్సరంలో జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ, వచ్చే ఐదేళ్ల కాలానికి రూపొందించాల్సిన కొత్త ప్రణాళికలపై దృష్టి పెడుతూ జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
”మహత్తర దేశాన్ని నిర్మించాలనే దృక్పథంతో, జాతీయ పునరుజ్జీవన క్రమాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ ప్రాధమికంగా సోషలిస్టు ఆధునీకరణను సాకారం చేయాలన్న లక్ష్యంపై ప్రణాళిక దృష్టి కేంద్రీకరించాలి.” అని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. 15వ పంచవర్ష ప్రణాళిక (2026-2030)లో చైనా ఆర్థిక, సామాజికాభివృద్ధిపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
మధ్యస్థం నుండి దీర్ఘకాలానికి ఆర్థిక, సామాజిక పురోగతికి కీలకమైన మార్గనిర్దేశక పత్రంగా, చైనా పంచవర్ష ప్రణాళిక వివిధ రంగాల వ్యాప్తంగా ఐదేళ్ళ కాలానికి దేశ సర్వతోముఖ లక్ష్యాలను, ప్రధాన కర్తవ్యాలను, విధానపరమైన దృక్పథాన్ని వివరిస్తోంది.
ఈ క్రమంలో ప్రతి నిర్దిష్ట రంగానికి లక్ష్యాలు, కర్తవ్యాలను నిర్దేశించాల్సి వుంది. ఆ మేరకు సహేతుకమైన రీతిలో చేపట్టాల్సిన చర్యలు, విధానాలను రూపొందించాల్సి వుందని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.
మనం మన స్వంత వ్యవహారాలను ధృఢంగా నిర్వహించుకుంటూనే ఉన్నత ప్రమాణాలతో కూడిన ప్రారంభాలను విస్తరించడానికి కూడా కట్టుబడి వుండాలని చైనా నేత ఆ సదస్సులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో సమున్నతమైన నాణ్యతతో కూడిన అభివృద్ధిని పెంపొందించాల్సి వుందన్నారు. అభివృద్ధి, భద్రత రెండు అంశాలపై మరింతగా దృష్టి పెట్టాలని కోరారు. ఇందుకు గానూ దేశీయంగా, అలాగే అంతర్జాతీయంగా ఎదురయ్యే ముప్పులు, సవాళ్ళను సమగ్రంగా అంచనా వేసుకోవాల్సి వుందన్నారు. దేశ భద్రతా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇంకా కృషి జరగాలని పిలుపిచ్చారు.
1950ల్లో తొలిసారిగా ప్రారంభించిన పంచవర్ష ప్రణాళిక దేశ సర్వతోముఖాభివృద్ధికి బ్లూ ప్రింట్‌గా పనిచేస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఏకీకృత నాయకత్వం కింద విస్తృత ప్రజాస్వామ్య ప్రాతినిధ్యంతో చక్కటి వ్యవస్థీకృతమైన వ్యవస్థ ద్వారా ఈ విధాన రూపకల్పన జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img