నవతెలంగాణ కర్నూలు: జిల్లాలోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్ చేశారు. ‘షర్ట్ బటన్ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా… సరే.. బటన్ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారు నూతన వసతి గృహంలోని 136వ నంబర్ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్టు సమాచారం.
బాధిత విద్యార్థి తాలూకా పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా… విద్యార్థి సంఘాల నాయకులు జోక్యం చేసుకొని వారి మధ్య సంధి కుదుర్చేందుకు యూనివర్శిటీ రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. అయినా బాధిత విద్యార్థి రాజీపడలేదనే చర్చ కొనసాగుతోంది. ఇలా జరగడం రెండోసారి కావడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై వీసీ వెంకట బసవరావు మాట్లాడుతూ.. విద్యార్థులు గొడవ పడినట్టు తమ దృష్టికి రాలేదన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.