హోరెత్తిన నినాదాలు… దద్దరిల్లిన కార్యాలయాలు
స్వచ్ఛందంగా తరలివచ్చిన విద్యార్థులు
ఇబ్రహీంపట్నం పట్టణంలో భారీ ర్యాలీ
ఎంపీడీవో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఆర్డీవో, అనంతరెడ్డి, తహశీల్దార్ సునీత రెడ్డికి వినతి
ఐ వాంట్ ఫీజు రియంబర్స్మెంట్ అంటూ నినాదాలు
ప్రతిధ్వనించిన ప్రభుత్వ కార్యాలయాలు
నవతెలంగాణ–ఇబ్రహీంపట్నం
ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రయివేట్ కళాశాల విద్యార్థులు రోడ్డు ఎక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఆర్డిఓ అనంతరెడ్డి పాల్గొన్న ప్రజాధర్బార్ ను ముట్టడించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. దాంతో విద్యార్థులు నినాదాల హోరుతో ప్రభుత్వ కార్యాలయాలు దద్దరిల్లాయి. “వీ వాంట్ టు ప్లీజ్ రియాంబర్స్మెంట్” అంటూ నినదించారు. చేతుల్లో ప్రా కార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని తూర్పార పట్టారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో రెండు సంవత్సరాలు కలిపి నాలుగు సంవత్సరాల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రైవేటు కళాశాల విద్యార్థులు ఒక్కసారిగా రోడెక్కారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని సుమారు ఐదారు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఒక్కసారిగా ర్యాలీ నిర్వహించడంతో నాగార్జునసాగర్ జాతీయ రహదారి స్తంభించింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ర్యాలీ నిర్వహించి ముందుగా ఇబ్రహీంపట్నం తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తాహశీల్దార్ సునీత రెడ్డికి వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాదర్బార్ పాల్గొన్న ఆర్డీవో అనంత రెడ్డికి వినతి పత్రం అందించేందుకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఆర్డిఓ అనంతరెడ్డి వచ్చి తమ సమస్యలను ఆలకించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఊరెత్తించారు. విద్యార్థులు నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రతిధ్వనించాయి. అనంతరం ఆర్డిఓకు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థుల నిరసనకు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు సైతం మద్దతు ప్రకటించాయి. వారు సైతం ర్యాలీలో భాగస్వాములయ్యారు.

విద్యార్థుల ర్యాలీకి మద్దతు ప్రకటించారు. విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఆందోళనకు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి జగన్ సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వాన్ని తూర్పారబెట్టారు. ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యదర్శి ఏర్పుల తరంగ తన మద్దతు ప్రకటించారు. ఏబీవీపీ నాయకులు సైతం విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం వల్ల చదువులకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అడపా దడపా ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువులు ముందుకు సాగడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం సైతం విద్యారంగాన్ని మరింత దిగజారుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా ఫీజు రియా మోసమెంటు విడుదల పూర్తిగా నిలిచిపోయిందని మండి పడ్డారు.
పేద విద్యార్థుల ఉన్నత చదువులు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా దిగజారి పోతోందని ఆందోళన వెలిబుచ్చారు. నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయాంబర్స్మెంట్ విడుదల చేయకపోతే కళాశాల యాజమాన్యాలు సైతం ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక, కళాశాల భవనాలకు అద్దెలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్న వారి తల్లిదండ్రులు చేతులెత్తేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో విద్యార్థులు అనేక మంది తమ చదువులను మధ్యలోనే మానేస్తున్నారని అన్నారు. బావి భారత పౌరులను తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.

ఓట్ల కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విద్యా రంగాన్నీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తిగా బంద్ ప్రకటించిన నేపథ్యంలో డిగ్రీ, ఇంటర్ విద్యార్థుల మాత్రం రోడ్ల మీదికి వస్తున్నారని తెలిపారు. అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విద్యార్థి లోకం ఫీజు రియాంబర్స్మెంట్ కోసం మొదటి సారిగా రోడ్లపైకి వచ్చారని తెలిపారు. ఈ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు పాల్గొన్నారు.