– 27 పంచాయితీ లు విజయం గెలిచి తీరుతాం
– నాయకులు జూపల్లి రమేష్
– సమర్ధవంతమైన అభ్యర్ధులను గెలిపించుకుందాం
– నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఎన్నిక ఏదైనా మండల స్థాయి నాయకులు,గ్రామస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తేనే విజయం సునాయాసం అవుతుందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హితవు పలికారు. డిసెంబర్ 11,14,17 తేదీలలో జరగనున్న పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని వినాయక పురంలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్నికల నిర్వహణ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ చిహ్నం హస్తం లేకపోయినా కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామాల అభివృద్ధి,ప్రజల సంక్షేమం,ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందేలా చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును వివరించాలని సూచించారు.
అభ్యర్థుల విజయమే గ్రామాల అభివృద్ధికి బలమైన పునాది అవుతుందన్నారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి గ్రామంలో సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేసారు.
చర్చాంశనీయంగా మారిన జూపల్లి ప్రసంగం :
సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ క్రియాశీల నేత జూపల్లి రమేష్ ప్రసంగం చర్చాంశనీయంగా మారింది. “తాను వ్యక్తిగతంగా ఏ పదవీ ఆశించ లేదని,నేనే పైరవీలు చేయడం లేదని,ఏ అధికారిని నేను ప్రభావితం చేయడం లేదని,ఏ అధికారి పని ఆ అధికారి చేసుకుని పోతున్నారని, రాజకీయం నాకొక వ్యాపకం అని,అందుకే నా స్వంత డబ్బులతో పార్టీ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నానని” ఆవేదనతో మాట్లాడారు.
18 గంటలు ప్రజాసేవ కోసం తపన పడుతున్న ఏకైక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాత్రమే నని,తనకు అందిన ప్రతీ దరఖాస్తును స్వయం పరిశీలించి పరిష్కారం కోసం ఎమ్మెల్యే జారె కృషి చేస్తున్నారని,మనం అందరం సమన్వయంతో పనిచే 27 పంచాయితీల్లో విజయం సాధిద్దామని ఆశాభావం వ్యక్తం చేసారు.
సమర్ధవంతమైన అభ్యర్ధులను బరిలో దింపాలి – మొగళ్ళపు చెన్నకేశవ రావు
ప్రజల్లో గుర్తింపు,పని చేయగల సామర్ధ్యం ఉన్న అభ్యర్ధులను బరిలో దింపాలని,అపుడే విజయం సాధ్యం అవుతుందని నాయకులు చెన్నకేశవ రావు అన్నారు.ఖర్చు చేయగల స్తోమత ఉన్నా ప్రజల్లో మన్ననలు పొందక పోతే విజయావకాశాలు పై ప్రభావం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు,సత్యనారాయణ చౌదరి తది తరులు పాల్గొన్నారు.



