Tuesday, July 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్ఫూర్తి ప్రదాత సుగుణమ్మ

స్ఫూర్తి ప్రదాత సుగుణమ్మ

- Advertisement -

సంస్మరణ సభలో ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నేతలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శాఖమూరి సుగుణమ్మ మహిళా ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాత అని ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ ఉపాధ్యక్షులు టి.జ్యోతి, రజిని అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ సంయుక్తంగా శాఖమూరి సుగుణమ్మ సంస్మరణ సభ నిర్వహించాయి. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుందరయ్య ఆశయాలకు అందరం కంకణబద్దులం కావాలని ఆకాంక్షించారు. రానున్న కాలంలో ఐక్యపోరాటాలు చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సుగుణమ్మ సారా వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. పేదలకు గృహాలు, మంచినీటి వసతి కోసం స్టాలిన్‌నగర్‌, అంజయ్యనగర్‌ వంటి ప్రాంతాల్లో ఆమె చేసిన పోరాటం ఫలించిందన్నారు. సమాన హక్కుల కోసం మహిళలు నిరంతరం పోరాడాలని ఎప్పుడూ చెప్పేవారన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. సుగుణమ్మ 8 ఏండ్ల వయస్సులోనే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ధైర్యంగా ముందుకు సాగారన్నారు. సారా వ్యతిరేక ఉద్యమంలోనూ కీలకంగా పనిచేసి, పేద మహిళలకు విద్య, ఉపాధి అవకాశాల కోసం కృషి చేశారన్నారు. పత్రికా రచయిత్రి జమున మాట్లాడుతూ.. చివరి దశలో మంచంపై ఉన్నప్పటికీ ఆమె ఆత్మస్థైర్యం కోల్పో లేదన్నారు. చివరి శ్వాస వరకు ప్రజల కోసం ఆలోచిస్తూ గడిపా రని చెప్పారు. ఐద్వా నాయకులు డి.ఇంద్ర మాట్లాడుతూ.. సుగుణమ్మ ధనిక కుటుంబంలో పుట్టినా జీవితమంతా సమాజ సేవకే అంకితమవుతూ గడిపారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో వచ్చిన అనుభవాలను, ఆధునిక సాంకేతికత లేని రోజుల్లో ఉన్న సవాళ్లను ఆమె ఎలా అధిగమించారో వారి కుమార్తె శోభ వివరించారు. ఈ కార్య క్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.అరుణజ్యోతి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నాయకులు బత్తుల హైమావతి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.జ్యోతి, రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, పీఎస్‌ఎన్‌ మూర్తి, డిజి.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. అరుణో దయ సాంస్కృతిక సమాఖ్య తరఫున విమలక్క పాట ద్వారా అరుణాంజలి అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -