Wednesday, April 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలుగు విశ్వవిద్యాలయంలో వేసవి శిక్షణా తరగతులు

తెలుగు విశ్వవిద్యాలయంలో వేసవి శిక్షణా తరగతులు

- Advertisement -

సినీ నటన, లలితకళల్లో 30 రోజుల ప్రత్యేక కోర్సులు
మే 1 వరకు దరఖాస్తుల స్వీకరణ..2 నుంచి శిక్షణ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో యువత, విద్యార్థుల సృజనాత్మక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో సినీ నటనతో పాటు లలితకళలలో 30 రోజులపాటు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ఈ శిక్షణ కార్యక్రమాలు బాచుపల్లి లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించ నున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడిం చారు. విశ్వవిద్యాలయంలోని రంగస్థల శాఖ అధ్యాపకుల పర్యవేక్షణలో సినీ నటన కోర్సును మే 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. నటనపై ఆసక్తి కలిగిన విద్యార్థులు, యువతకు ఉపయోగపడే విధంగా ఈ కోర్సులో అభినయ పాఠాలు, హావభావాలు, సంభాషణ తీరు, వేదికపై ప్రదర్శన, పాత్ర ఆవిష్కరణ, శరీర భాష, కెమెరా ముందు ప్రవర్తన వంటి అంశాలపై ప్రాయోగిక శిక్షణ అందించనున్నట్టు చెప్పారు. అదే విధంగా లలితకళల విభాగంలో చిత్రలేఖనం, శిల్పకళ, ప్రింట్‌ మేకింగ్‌ అంశాల్లో కూడా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కోర్సుల ద్వారా కళ పట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులకు రేఖాచిత్రం, రంగుల వినియోగం, ఆకృతి నిర్మాణం, శిల్ప రూపకల్పన, ముద్రణా కళల ప్రాథమిక, ప్రాయోగిక పరిజ్ఞానం అందించ నున్నట్టు తెలిపారు. రెండు కోర్సుల్లో చేరదలచిన అభ్యర్థుల నుంచి ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు. సినీ నటన కోర్సుకు రూ.5,000, ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుకు రూ.3,000 ఫీజు నిర్ణయించినట్టు వెల్లడించారు. కళలు, నటన రంగాల్లో తమ ప్రతిభను మెరుగు పరుచుకోవాలనుకునే విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -