Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeసోపతిసూర్యుడు.. చంద్రుడు.. నాన్న

సూర్యుడు.. చంద్రుడు.. నాన్న

- Advertisement -

ప్రపంచంలో డబ్బుతో అన్ని సౌకర్యాలను పొందగలం. కానీ మానవ సంబంధాలలో కొన్ని విలువలను, బంధాలను డబ్బుతో వెలకట్టలేం. అందులో తల్లిదండ్రుల విలువను దేనితోనూ ముడిపెట్టలేం. అందుకే ఆ ఇద్దర్ని ‘మాతదేవోభవ, పితదేవోభవ’ అని కీర్తిస్తారు. తల్లి చేసే శారీరక శ్రమ, కళ్ళకు కనిపించినా దాని వెనకాల నాన్న ‘త్యాగం’ కూడా ఉంటుందనేది జగమెరిగిన సత్యం.
తల్లీతండ్రి ఋణం తీర్చుకోలేం. ఎప్పటికి తీరదు కూడా. అమ్మ నవ మాసాలు మోస్తుంది, అన్ని సపర్యలు చేస్తుంది. ఆ సపర్యలకు కావాలిసినవన్నీ ‘నాన్న’ సమకూర్చుతాడు. అందుకే నాన్న గొప్పతనం తెర వెనుక పాత్రకు పరిమితమైనా ‘నాన్న’ లేని జీవితం తెడ్డులేని నావలాంటిది. తీరం తెలియని ప్రయాణం లాంటిది. అందుకే ఆయన విలువను తెలియజేసే ఓ చిన్న కథను చదవండి.
ఓ పిల్లవాడు తండ్రిని ఊర్లోకి వచ్చిన ‘సర్కస్‌’ను చూయించాలని బాగా ఇబ్బంది పెడ్తాడు. తన వద్ద డబ్బులు లేవని డబ్బులు రాగానే చూయిస్తానని చెప్తాడు తండ్రి. ఐనా మారాం చేస్తాడు పిల్లవాడు. ఎంత చెప్పినా వినకుండా బాగా అల్లరి చేస్తాడు. దానికి కరిగిపోయిన తండ్రి సరే ఈరోజు సాయంత్రం సర్కస్‌కు తీసుకొని వెళ్తాను సిద్ధం కమ్మని చెప్తాడు. దానికి సంతోషపడిన ఆ పిల్లవాడు ఆనందంతో తండ్రిని గట్టిగా వాటేసుకుంటాడు. చెప్పినట్లుగానే సాయంత్రం సర్కస్‌కి తీసుకొని వెళ్తాడు. ఆ సర్కస్‌లో కనిపించే ఆట బొమ్మలు, తినుబండారాలు ఇప్పించాలని తండ్రిని బాగా ఇబ్బంది పెడతాడు. కానీ తండ్రి వద్ద డబ్బులు లేని విషయం తెలియని పసితనం ఆ పిల్లవాడిది. పిల్లవాడి మొండి ప్రవర్తనకు తండ్రి లోలోన బాధపడతాడు. సర్కస్‌లోని విపరీతమైన రద్దీలో పిల్లవాడు తండ్రి చేయి విడిచిపెట్టడంతో ఇద్దరూ చెరో దారి అవుతారు. తండ్రి కనిపించటం లేదని ఏడవటం మొదలు పెడ్తాడు పిల్లవాడు. ఏడుపు విన్న దూకాణదారులు ఆ పిల్లవాడి చుట్టూ గుమికూడి తన తండ్రి వేలు పట్టుకొని నడుస్తున్నప్పుడు ఏవైతే అడిగాడో అవన్నీ ఇస్తామని చెప్పినా వినకుండా తన తండ్రి మాత్రమే కావాలి, అవేమీ వద్దని ఇంకా బిగ్గరగా ఏడుస్తాడు. ‘నాన్న ఎక్కడున్నావ్‌? ఎటు వెళ్ళిపోయావ్‌’ అంటూ గట్టిగా ఏడుస్తాడు. ఆ చుట్టూ పక్కలవారు ఎంతగా సముదాయించినా కుదుటపడడు. ఈలోగా పిల్లవాడికి నాన్న కన్పిస్తాడు. ఒక్క పరుగున వెళ్ళి తండ్రిని గట్టిగా హత్తుకుంటాడు. ఇది చూసిన ఆ దుకాణదారులందరు సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. చూశారాగా తప్పిపోవడానికి ముందు ఆ పిల్లవాడు కొనుక్కోవాలనుకున్నవన్నీ డబ్బులతో ముడిపడివున్న వస్తువులే కానీ అవి కొనే స్తోమతలేని తండ్రి గూర్చి పిల్లవాడికి తెలియని అమాయకత్వం.
అమ్మ జన్మనిస్తుంది పెంచి పెద్ద చేస్తుంది. కానీ మనం నాన్న వేలు పట్టుకొనే నడుస్తాం. చిన్నతనంలో నాన్నే మనకు సూపర్‌ హీరో. అందుకే ఆ అనుభూతిని ఆస్వాదిస్తే తప్ప వ్యక్తం చేయలేం. ఏదో పాశ్చాత్య సంస్కతి మోజులో పడి ‘ఫాదర్స్‌ డే’ లాంటివి సెలబ్రేట్‌ చేసుకొని సంతోషపడుతాం కాని ఎన్ని సెలెబ్రేషన్స్‌ చేసినా తండ్రి ఋణం తీర్చలేం. అందుకే నాన్నను ఒకరోజు కాకుండా సంవత్సరాల తరబడి ప్రేమిద్దాం. ఆస్తులు ఏం పంచి ఇచ్చావ్‌ అని అడగకుండా జన్మనిచ్చినందుకు గర్వపడుదాం. నాన్న నుండే మన వారసత్వాన్ని తీసుకుంటాం. నువ్వు ఎవరు అనే దానికి సమాధానం మీ నాన్నే. నీ ప్రతీ ఆధారం మీద (ఆధార్‌ కార్డు, పాస్‌ పోర్ట్‌, రేషన్‌ కార్డు, ఎలక్షన్‌ కార్డు, సర్టిఫికేట్లు) నాన్న పేరు ఉంటుంది. ఇంతకు మించి ఏం కావాలి మనకు. తండ్రి నుండి మనం వారసత్వంగా ఇన్ని తీసుకున్నప్పుడు తిరిగి మనం ఏం ఇవ్వగలం?
విధేయత, కతజ్ఞత ఇవి ఆశించి మీ నాన్న మిమ్మల్ని పోషించడు, అలాగే పెంచడు కూడా. ఆయన మీ నుండి ఏం ఆశిస్తాడు? మీరు సంపాదించే వజ్రాలు, వైడుర్యాలు కాదు కదా? ఆయన కళ్ళముందు మీరు ఉన్నత స్థానాలకు ఎదిగితే అదే ఆయనకు మీరిచ్చే అసలైన బహుమతి. చాలామంది నాన్నలకు ఆ అదష్టం వుండదు. ఎందుకంటే చాలామంది నాన్నలు పిల్లలు పెద్దై ప్రయోజకులు కాకముందే ఈ లోకం నుండి వెళ్ళిపోతారు. వారు ఎంత దురదష్టవంతులో ఒకసారి ఆలోచించండి? తండ్రి వున్నా మీరు ఆదరించకపోవడం వల్ల వద్ధాశ్రమాల్లోనో, అనాధశరణాలయాలలో ఉంటున్న వారు ఎంతమంది? ఇక్కడ ఎవరు ఎవరిని గౌరవించాలి ఓసారి ఆలోచిచండి. నువ్వు గెలిచినప్పుడు పదిమందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి నీ భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. కన్నతల్లి లేకపోతే ఎవరినైనా అమ్మా అని పిలిచి ఆ లోటును, బంధాన్ని కలుపుకోవచ్చు. కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరం ఐతే నువ్వు గుండెలు పగిలేలా ఏడ్చినా దిక్కులు అదిరేలా పిలిచినా బదులురాదు. ఆ పిలుపు రక్తం పంచి ఇచ్చిన నాన్నకు మాత్రమే సొంతం. మన సంతోషంలో తన సంతోషం వెతుక్కునే నిష్కల్మష హదయం నాన్నది. తను జీవితంలో ఓడినా మన గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తాడు. తను దీపంలా కరుగుతూ మనల్ని వెలుగులో ఉంచుతాడు. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు తనే విద్యార్ధిలా ఆనందపడ్డాడు మా నాన్న. తను ఆశించే స్థాయికి నేను చేరుకునేలోపే రోడ్డు ప్రమాదంలో మాకు దూరమయ్యారు. మీలో ఎవరైనా నాన్న త్యాగం లేకుండానే ఎదిగారా? మొక్క ఎదగడానికి వేర్లు భూమిలో ఉండి అది చెట్టుగా విస్తరించేలా చేస్తాయి. కుటుంబానికి నాన్న కూడా వేరు లాంటివాడే. అందుకే నాన్న బతికి ఉండగానే వారి ముఖంలో ఆనందం చూడండి. అంతేకాని వారు పోయాక వారి ఫొటోలతో పేపర్లలో ప్రకటనలు ఇచ్చి ఊరంతా పండుగలాగ భోజనాలు పెట్టడం కాదు. బతికుండగానే ఆదరించండి. అలా ఐతేనే అనాధశరణాలయాలు, వద్ధాశ్రమాలు తగ్గుతారు.
– డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad