– కులం, మతం, ప్రాంతం పేరుతో విడిపోతే దోపిడీ వర్గాలకు అనుకూలం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్థంతి
– హాజరైన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ప్రభాకర్
నవతెలంగాణ-మియాపూర్
కుల వివక్షకు వ్యతిరేకంగా తన ఇంటి నుంచే పోరాటాన్ని ప్రారంభించిన మహానేత పుచ్చలపల్లి సుందరయ్య అని,పేదలందరికీ మెరుగైన విద్య, వైద్యం అందాలన్నదే ఆయన ఆశయం అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కొనియాడా రు. హైదరాబాద్ గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య 40వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలోనే సుందర య్యకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. చదువుకునే రోజుల్లోనే పేదల పక్షాన పోరాటం చేస్తూ ఆయన కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులైనట్టు గుర్తు చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో ముందుండి పోరాడిన వ్యక్తి సుందరయ్యని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించడం ద్వారా వ్యవసాయంలో కూలీలుగా పని చేస్తున్న ప్రజలు అండగా నిలిచారన్నారు. వెట్టిచాకిరీకి గురై కూలి సరిగా రాని రోజుల్లో వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా కనీస వేతనాల అమలు కోసం భూస్వాములకు వ్యతిరేకం గా పోరాటం నిర్వహించారని వివరించారు. తన పేరులో రెడ్డిని తొలగించుకుని సుందరయ్యగానే సమాజంలో గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజలంతా కులం, మతం, ప్రాంతం పేరుతో విడిపోతే దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉంటుం దని, అందుకనే ప్రజలంతా కలిసి ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. ఎర్రజెం డాతోనే పేదలకు న్యాయం జరుగుతుందని, ఆయన ఆశయ సాధనకు మనమంతా ముందుండి పోరాడా లని అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజం కోసం పనిచేసే వారిలో సుందరయ్యలాంటి మహానేతలు చాలా తక్కువ మంది ఉంటారని అన్నారు. తనకు పిల్లలు పుడితే సమాజంలో పోరాటానికి సమయం ఇవ్వలేకపోతానని పిల్లలు వద్దనుకున్న మహానేత అని గుర్తు చేశారు. ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే తరతరాలకు తరగని ఆస్తి సంపాదించే రోజుల్లో మనం ఉన్నామని, అలాంటి మహానేతను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంత గానో ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) శేరిలింగంపల్లి నాయకులు శోభన్, కృష్ణ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సిబ్బంది సాంబశివరావు, అనిల్, రవి విజరు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన విద్య, వైద్యమే సుందరయ్య ఆశయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES