Wednesday, April 30, 2025
Homeఆటలుచెపాక్‌లో 'సన్‌రైజ్‌'

చెపాక్‌లో ‘సన్‌రైజ్‌’

– చెన్నైపై హైదరాబాద్‌ మెరుపు విజయం
– సూపర్‌కింగ్స్‌ 154/10, సన్‌రైజర్స్‌ 155/5
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌18లో మూడో విజయం సాధించింది. పేలవ ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 155 పరుగుల స్వల్ప ఛేదనలో ఇషాన్‌ కిషన్‌ (44), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19) మెరువగా.. హర్షల్‌ పటేల్‌ (4/28) నాలుగు వికెట్ల ప్రదర్శనతో చెన్నై సూపర్‌కింగ్స్‌ తొలుత 154 పరుగులకు కుప్పకూలింది. చెపాక్‌లో చెన్నైపై హైదరాబాద్‌కు ఇదే తొలి విజయం!.
నవతెలంగాణ-చెన్నై
చెపాక్‌ కోటను సన్‌రైజర్స్‌ బద్దలుకొట్టింది. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఇక్కడ సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది. 155 పరుగుల ఊరించే లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌ (44, 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ ఆర్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌ నమోదు చేయగా.. కామిందు మెండిస్‌ (32 నాటౌట్‌, 22 బంతుల్లో 3 ఫోర్లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19 నాటౌట్‌, 13 బంతుల్లో 2 ఫోర్లు) ఆరో వికెట్‌కు అజేయంగా 31 బంతుల్లోనే 49 పరుగులు జోడించారు. సన్‌రైజర్స్‌కు సీజన్లో మూడో విజయం అందించారు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (0), ట్రావిశ్‌ హెడ్‌ (19, 16 బంతుల్లో 4 ఫోర్లు) సహా స్టార్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ (7, 8 బంతుల్లో 1 ఫోర్‌) నిరాశపరిచాడు. అనికెత్‌ వర్మ (19, 19 బంతుల్లో 2 సిక్స్‌లు) మంచి ఆరంభం అందుకున్నా.. ఆఖరు వరకు వికెట్‌ నిలుపుకోలేదు. సూపర్‌కింగ్స్‌ బౌలర్లలో స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ (2/42) కీలక వికెట్లతో ఆతిథ్య జట్టును రేసులో నిలిపినా.. స్వల్ప స్కోరును కాపాడుకునే క్రమంలో 15 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో కోల్పోవటం చెన్నైకి దెబ్బతీసింది. అంతకుముందు, హర్షల్‌ పటేల్‌ (4/28) నాలుగు వికెట్లతో విజృంభించగా చెన్నై సూపర్‌కింగ్స్‌ 19.5 ఓవర్లలో 154 పరుగులకు కుప్పకూలింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (42, 25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు), ఆయుశ్‌ మాత్రె (30, 19 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. షేక్‌ రషీద్‌ (0), శామ్‌ కరణ్‌ (9), శివం దూబె (12), ఎం.ఎస్‌ ధోని (6) నిరాశపరిచారు. ఈ సీజన్లో చెపాక్‌లో చెన్నైకి ఇది నాల్గో పరాజయం.
హర్షల్‌ విజృంభణ
టాస్‌ నెగ్గి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు బౌలర్లు అదిరే ఆరంభం అందించారు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే షేక్‌ రషీద్‌ (0) వికెట్‌తో షమి శుభారంభం అందించగా.. శామ్‌ కరణ్‌ (9) వికెట్‌తో హర్షల్‌ పటేల్‌ వేట మొదలెట్టాడు. యువ ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రె (30) ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా (21), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (42) ఇన్నింగ్స్‌కు వేగం పెంచే ప్రయత్నం చేశారు. నాలుగు సిక్సర్లతో బ్రెవిస్‌ చెపాక్‌కు ఊపు తీసుకొచ్చాడు. హర్షల్‌ పటేల్‌ ఓవర్లో మెండిస్‌ సూపర్‌ క్యాచ్‌తో బ్రెవిస్‌ నిష్క్రమించగా.. సూపర్‌కింగ్స్‌ పతనం వేగవంతమైంది. శివం దూబె (12), ఎం.ఎస్‌ ధోని (6), అన్షుల్‌ (2) నిరాశపరిచారు. ఆఖర్లో దీపక్‌ హుడా (22) నిలిచినా..ఆశించిన దూకుడు చూపించలేదు. 19.5 ఓవర్లలో 154 పరుగులకు చెన్నై ఆలౌటైంది. సన్‌రైజర్స్‌ పేసర్లు పాట్‌ కమిన్స్‌ (2/21), జైదేవ్‌ ఉనద్కత్‌ (2/21) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img