నవతెలంగాణ-హైదరాబాద్: 8వ తరగతి పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశం చేర్చడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని తాను గమనించానని చెప్పారు. సంస్థను కించపరుస్తామంటే ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇప్పటికే ఈ అంశంపై అనేక ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయని గుర్తుచేశారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసు అన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదేదో ప్రణాళికబద్ధంగా.. ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకంటే తాను ఏమీ చెప్పదలచుకోలేదన్నారు. ఏదేమైనా ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వీలకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. తదుపరి చర్యలకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం సూచించింది.
NCERT 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే కంటెంట్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దృష్టికి సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తీసుకొచ్చారు. సుమోటో కాగ్నిజెన్స్ చేయాలని కోరారు. పాఠశాల విద్యార్థులకు ఇలాంటి పాఠాలు నేర్పించడం ద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని.. ఇది చాలా విచారకరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠ్యాంశం తీరుపై న్యాయవాదులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.



