నవతెలంగాణ-హైదరాబాద్: అభ్యంతరకర వీడియో పోస్ట్ చేసిన అసోం సీఎంపై ఎఫ్‌ఐఆర్, సిట్ దర్యాప్తు కోరుతూ CPI(M) దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ”ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల్లో కొంత భాగం సుప్రీంకోర్టులో జరుగుతాయి” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ముందస్తు తేదీ కోసం పిటిషన్‌ను మౌఖికంగా ప్రస్తావించిన న్యాయవాది నిజాంపాషాకు విచారణ షెడ్యూల్‌ను ఇచ్చేందుకు సీజేఐ అంగీకరించారు.
ముస్లిం కమ్యూనిటీపై శతృత్వం : పిటిషన్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నప్పుడు హిమంత బిస్వాశర్మ ” అసోంలో నివసిస్తున్న ముస్లిం సమాజంపై శతృత్వాన్ని, బహిరంగ హింస లక్ష్యంగా చేసుకుని, భయభ్రాంతులకు గురిచేసే, రెచ్చగొట్టే ” ప్రసంగాలు చేశారని CPI(M) పిటిషన్‌లో పేర్కొంది. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రతివాది నెం.4(హిమంత బిస్వా శర్మ) అనేక సందర్భాల్లో, రాష్ట్ర ప్రాదేశిక పరిమితులకు లోబడి, పరిమితులను దాటి బహిరంగ ప్రసంగాలు మరియు ప్రకటనలు చేశారు. ఇవి ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వ్యాప్తి చెందాయి. ఈ ప్రకటనలను కలిపి చూస్తే.. అవి మైనారిటీని కించపరిచేలా చేయడం, తప్పుడు మరియు కళంకం కలిగించే స్టీరియోటైప్‌లను ప్రచారం చేయడం, సామాజిక, ఆర్థిక బహిష్కరణను ప్రేరేపించడం మరియు సదరు సమాజంపై బహిష్కరణ, హింస పరిస్థితులను ప్రోత్సహించేలా ఉన్నాయని, దీంతో అవి ద్వేషపూరిత ప్రసంగాలని పేర్కొంది. 2026 ఫిబ్రవరి 7న ఎక్స్‌లోని బీజేపీ అధికారిక హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో, అనంతరం విస్తృతంగా ప్రచారం చేయబడింది. ఈ వీడియో అత్యంత స్పష్టమైన మరియు ఆందోళన కలిగించే సాక్ష్యాధారంగా పేర్కొంది.



