న్యూఢిల్లీ: ఏపీ మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అక్రమమని దాఖలైన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. సుప్రీంకోర్టులో రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు జస్టిస్ జెబి పార్థివాల, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. పిటిషనర్ ఉపేంద్ర రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు మహేష్ జెఠ్మలానీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. తెలంగాణలో అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లడం అక్రమమని పేర్కొన్నారు. అరెస్టు సమయంలో చేర్చిన సెక్షన్లకు, రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సెక్షన్లకు సంబంధం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అరెస్టు సమయంలో 420 సెక్షన్లు చేర్చిన సీఐడీ పోలీసులు, ఆ తరువాత అవినీతి నిరోధక చట్టం సెక్షన్లను చేర్చారని పేర్కొన్నారు. వాదనలు విన్న అనంతరం ఏపీ సీఐడీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఆ లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.