నవతెలంగాణ-హైదరాబాద్:విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ)కి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను రూపుమాపి.. సమానత్వ భావనను పెంపొందించే లక్ష్యంతో…యూజీసీ తెచ్చిన 2026 నిబంధనల అమలుపై స్టే విధించింది. దీని అమలుకు స్వేచ్ఛా, సమానత్వం, సమగ్రతతో కూడిన వాతావరణం అవసరమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
రిజర్వుడు కేటగిరీల కిందకు రాని విద్యార్థులు, బోధనా సిబ్బందికి రక్షణ కల్పించే విషయాన్ని కొత్త నిబంధనల్లోని 3(సి) విస్మరించిందని పేర్కొంటూ వినీత్ జిందాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వర్సిటీలు సైతం దీనిని అదనపు బాధ్యతలుగా చూస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కమిటీ ప్రతినిధుల మధ్య విభేదాలు పెరిగే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురువారం విచారణ చేపట్టిన కోర్టు తాజాగా స్టే ఆర్డర్ ఇచ్చింది.
అభ్యంతరాలు దేనికి?
సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలు సమర్థించాయి. అయితే కొత్త నిబంధనలలోని కులవివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయడంపై జనరల్, ఇతర కేటగిరీల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. కొంతమంది విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలు అనుకోకుండా కొత్త విభజనలకు దారితీయవచ్చని.. అలాగే దుర్వినియోగం జరగకుండా సరైన రక్షణలు లేవని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయానికి కూడా ఈ నిరసన సెగ తాకింది. దీనికి నిరసనగా పార్టీకి కొందరు బీజేపీ నేతలు, ఓ సీనియర్ బ్యూరోక్రాట్ రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.



