Friday, July 25, 2025
E-PAPER
HomeజాతీయంSupreme Court Stays : బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

Supreme Court Stays : బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

- Advertisement -

నవతెలంగాణ ఢిల్లీ: 2006లో జరిగిన ముంబయి రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని బాంబే హైకోర్టు ఇటీవల నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

2006 జులై 11న ముంబయి పశ్చిమ రైల్వేలైన్‌లోని పలు సబర్బన్‌ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. యావత్‌ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఈ మారణహోమంలో 189 మంది మృత్యువాత పడగా… మరో 800 మందికి పైగా గాయపడ్డారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబరులో ప్రత్యేక కోర్టు.. 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

అయితే, ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు.. ఆ 12 మందిని నిర్దోషులుగా తేల్చింది. వారిపై ఉన్న అభియోగాలను నిర్దరించడంలో ప్రాసిక్యూషన్‌ ఘోరంగా విఫలమైందని పేర్కొంది. ఎలాంటి పేలుడు పదార్థాలు వాడారన్నది నిరూపించలేకపోయారని తెలిపింది. దీంతో వారిని విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ నిందితులకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -