Friday, September 26, 2025
E-PAPER
Homeజాతీయందిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల దోషి ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల దోషి ఉరిశిక్షపై సుప్రీంకోర్టు స్టే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన అసదుల్లా అక్తర్‌కు విధించిన మరణశిక్ష అమలుపై సుప్రీంకోర్టు గురువారం తాత్కాలికంగా స్టే విధించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అక్తర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ సందీప్‌ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. నిందితుడికి సంబంధించిన పలు అంశాలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

జైలులో అక్తర్ ప్రవర్తన, అతడికి అప్పగించిన పనుల గురించి జైలు సూపరింటెండెంట్‌, ప్రొబేషన్‌ అధికారులు నివేదిక ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా, అక్తర్ మానసిక స్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నివేదిక తీసుకోవాలని సూచించింది. ఈ నివేదికలన్నింటినీ ఎనిమిది వారాల్లోగా తమకు సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 12 వారాలకు వాయిదా వేసింది.

2013లో హైదరాబాద్‌లోని జనసమ్మర్ధం అధికంగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో రెండు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, 131 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌ సహా ఐదుగురు దోషులకు 2016 డిసెంబరులో ఎన్‌ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్థించింది. ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్న అక్తర్, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -