Tuesday, April 29, 2025
Homeజాతీయంపెగాసస్‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

పెగాసస్‌పై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్‌ వ్యవహారంపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం కీల‌కవ్యాఖ్య‌లు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్‌ను కలిగిఉండటం తప్పులేదని స్ప‌ష్టం చేసింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అయితే ఆ స్పైవేర్‌ను ఎలా, ఎవరిపై వినియోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పెగాసస్‌ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.ఒకవేళ సామాన్య పౌరులపై స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. కానీ జాతి వ్యతిరేక శక్తులకు, ఉగ్రవాదులకు గోప్యత హక్కు ఉండదు. సామాన్య పౌరుల గోప్యతకు మాత్రం మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం’ అని వ్యాఖ్యానించింది.

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు ఎన్‌ఎస్‌వో విక్రయిస్తుంటుంది. అయితే ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్‌ నుంచి 300 మంది ఫోన్‌లు హ్యాక్‌ అయినట్లు పేర్కొంది. వారిలో రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు తెలిపింది. ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే పెగాసస్‌పై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను రూపొందించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img