నవతెలంగాణ-హైదరాబాద్: సీపీఐ అగ్రనేత, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి సురవరం సుధాకరరెడ్డి అంతిమయాత్రను ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆయన చిన్న కుమారుడు నిఖిల్ అమెరికా నుంచి రావాల్సి ఉన్నందున భౌతికాయాన్ని కొండాపూర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు అక్కడి నుంచి హిమాయత్‌నగర్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు భౌతికకాయాన్ని తరలించనున్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడే ఉంచుతారు. అనంతరం అధికారిక లాంఛనాలతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో భౌతికకాయాన్ని గాంధీ వైద్య కళాశాలకు సిపిఐ నేతలు అప్పగించనున్నారు.
