నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని సీపీఐ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అక్కడే సంతాప సందేశం రాసి సీఎం సంతకం చేశారు. సీఎం వెంట మంత్రి సీతక్క, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సురవరం మరణం పేద,బలహీన వర్గ ప్రజలకు తీరని లోటు అని అన్నారు. కడ వరకు తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన విశిష్ట వ్యక్తి అని కొనియాడారు. సురవరం సుధాకార్ రెడ్డి గారు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని సూచించారు. ఆయన సూచనను గౌరవించి తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాం అని తెలిపారు.

ఇప్పటికే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు. నేతలు, అభిమానుల సందర్శనార్థం సాయంత్రం వరకు అక్కడే ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు.