Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబల్మూరు రిజర్వాయర్‌ నిర్మాణానికి సర్వే..

బల్మూరు రిజర్వాయర్‌ నిర్మాణానికి సర్వే..

- Advertisement -

– పోలీసుల మోహరింపు
– భూములు కోల్పోతామని రైతుల ఆందోళన
– నష్టపరిహారం అడగండి.. కోర్టులో తేల్చుకోండి : పోలీసులు
– కొనసాగిన రిజర్వాయర్‌ సర్వే
నవతెలంగాణ -బల్మూరు

బల్మూరు ఉమామహేశ్వర రిజర్వాయర్‌ నిర్మాణం కోసం గురువారం కాంట్రాక్టర్లు సర్వే నిర్వహించారు. అయితే, రిజర్వాయర్‌ నిర్మాణం ఈ ప్రాంతంలో వద్దని, వ్యవసాయ భూములు పోతాయని రైతులు రెండున్నర ఏండ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో సర్వే పనులను అడ్డుకోకుండా ముందస్తుగా పోలీసులను మోహరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలోని అనంతవరం గ్రామ సమీపాన రెండు కిలోమీటర్ల దూరంలో పాపయ్య గుట్ట సమీపం నుంచి సర్వే చేసేందుకు కాంట్రాక్టు సిబ్బంది, ఇరిగేషన్‌ అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి తరలివచ్చారు. తమ పంట పొలాలు పోతాయని, సర్వే చేయొద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఎంతో కాలంగా రిజర్వాయర్‌ మాకొద్దంటూ మొరపెట్టుకుంటున్నా.. బలవంతంగా మా భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములు తీసుకుని.. మరెవరికో నీళ్లు ఇస్తావా..? ఇందకేనా ఓట్లేసి గెలిపించింది.. అంటూ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను ఉద్దేశించి ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రిజర్వాయర్‌ తెచ్చినందుకే ఆయనను ఇంటికి పంపించామని, నీ గతి ఏమైతదో అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సర్వేను అడ్డుకునేందుకు యత్నించారు. సర్వేను అడ్డుకోవద్దు.. నష్టపరిహారం అడగండి.. లేదా కోర్టులకు వెళ్లండి.. అంతేగానీ అనవసరంగా సర్వేను అడ్డుకోవద్దంటూ పోలీసులు రైతులకు సర్దిచెప్పే యత్నం చేశారు. అనవసరంగా కేసులపాలు కావొద్దని.. మీ మంచి కోసమే చెబుతున్నాం.. ఇక్కడి నుంచి వెళ్లి ఎవరి పొలాల్లో వారుండాలని సూచించారు. దాంతో రైతులు చేసేదేమీ లేక వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తు నడుమ నాలుగు బృందాలుగా విడిపోయిన సర్వేయర్లు పాపయ్య గుట్ట, అంబగిరి రోడ్డు, నల్లచెరువు కట్ట, మైలారం సమీపాన సర్వే జండాలను పాతారు. అయితే, రైతులు ఎవరి పొలంలో వారు ఉంటూనే సర్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి ఇతర రైతులు మద్దతుగా రాగా, పోలీసులు వారిని హెచ్చరించారు. విత్తనాలు వేసుకునే సమయంలో సర్వే చేయరాదంటూ మరికొందరు రైతులు అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మొదలైన సర్వే పనులు మధ్యాహ్నం రైతులు వెళ్లిపోయాక తిరిగి కొనసాగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -