– దేశ ఆహార భద్రతకు, రైతుల సంక్షేమానికి ఆయన కృషి నిరుపమానం : ఎం.ఎస్. స్వామినాథన్ శత జయంతి ముగింపు సభలో వెంకయ్యనాయుడు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో వ్యవసాయ రంగం సమూలంగా మార్పు చెందాలంటే ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ చూపించిన మార్గంలో పయనించాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన బోధనలు, దార్శనికత నుంచి అందరం స్ఫూర్తిని పొందాలన్నారు. శనివారం నాడిక్కడ సి.సుబ్రమణ్యం ఆడిటోరియంలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామినాథన్ శత జయంతి ముగింపు కార్యక్రమం జరిగింది. ‘ఎవర్ గ్రీన్ రివల్యూషన్-ది పాత్ వే టు బయో హ్యపీనెస్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. గొప్ప దార్శనికుడైన స్వామినాథన్ దేశ గమ్యాన్నే మార్చేశారన్నారు. దేశం తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నప్పుడు పంటలు సమద్ధిగా పండాలనే లక్ష్యంతో హరిత విప్లవానికి పునాది వేశారన్నారు. దేశ వ్యవసాయ పరిశోధనలను ఆయన కొత్త పుంతలు తొక్కించారని, శాస్త్రీయ ఆవిష్కరణలకు, క్షేత్రస్థాయి అవసరాలకు మధ్య అంతరాలను పూడ్చారని అన్నారు. క్షేత్ర స్థాయి అవసరాలకు అనుగుణంగా పరిశోధన లుండాలని నమ్మడమే కాకుండా ఆచరించి చూపించారని వెల్లడించారు. వ్యవసాయం బాగుండాలని, అదే సమయంలో పర్యావరణానికి హాని కలగకూడదనేదే ఆయన సిద్ధాంత మన్నారు. అందుకే ఆయన ‘ఎవర్ గ్రీన్ రివల్యూషన్’ అనే భావనను ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. అంతకు ముందు రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ స్వామినాథన్ కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, నిత్యా స్వామినాథన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జాట్, మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రానికి మానవత్వాన్ని జోడించిన వ్యక్తి స్వామినాథన్
- Advertisement -
- Advertisement -