నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ తుదిపోరులో మరోసారి ఇండియా భారీ స్కోర్ చేసింది. వాంఖడే స్టేడియంలో మాదిరిగానే అహ్మదాబాద్‌లో కూడా పరుగుల వరద పారించింది. 20 ఓవర్లలకు గాను 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల కొండంత లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. అభిషేక్ శర్మ(52), సంజు(89), ఇషాన్(54) అర్ధ సెంచరీలతో మోత మోగించారు. పాండ్యా(18), దూబె(22) రాణించారు. కివీస్ బౌలర్లు నీషమ్ 3, రచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశారు.
అంతకముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు శుభారంభాన్నించారు. తొలి బంతినుంచే దూకుడు ప్రదర్శించారు. టోర్నీలో ఫామ్ కోల్పోయిన అభిషేక్ శర్మ కీలక మ్యాచ్‌లో దుమ్ములేపాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్‌లో సంజు కూడా సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. 33 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు సంజు. దీంతో పవర్ ప్లే(0-6) ముగిసేరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది ఇండియా.
మంచి జోరులో ఉన్నా అభిషేక్ శర్మను ఏడో ఓవర్లో రచిన్ రవీంద్ర ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కూడా అదే జోరును కొనసాగించాడు. 23 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్, సంజు కలిసి ఫోర్లు, సిక్సులు బాదుతూ కీవీస్ బౌలర్లును ఆడుకున్నారు. ఈక్రమంలోనే బౌలింగ్‌కు వచ్చిన నీషమ్ వారి దూకుడు కళ్లెం వేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నా సంజు(89), ఇషాన్(54)లను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ను డకౌట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా టీమిండియా బ్యాటర్లు దూకుడు నెమ్మదించింది. ఆ తర్వాత వచ్చిన ధనాధన్ బ్యాటర్ పాండ్యా కూడా 13 బంతుల్లో 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివరలో తిలక్(8), దూబె(22) సిక్సుల మోత మోగించారు. లాస్ట్ ఓవర్లో 24 రన్స్ పిండుకున్నారు.



