నవతెలంగాణ - హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా బల్క్ దరఖాస్తుల ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోషామహల్‌లోని బూత్ నంబర్ 28, 30, 127లో ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించేందుకు ముందుగానే ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తున్నారని ఆరోపించారు. ఈ ఓటర్లందరి పేర్లు కనీసం 2002 నుంచి జాబితాలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఒకే వ్యక్తి 122 దరఖాస్తులు ఎలా సమర్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కుట్ర వెనుక బీజేపీ నాయకులు ఉన్నారని ఒవైసీ ఆరోపించారు.
బల్క్‌గా, తప్పుడు ఫారం-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియను పాత పద్ధతిలోనే జరపాలని ఆయన డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)