నవతెలంగాణ - హైదరాబాద్ : కస్టడీలో ఉన్న సమయంలో తన నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సహాయం చేశామని చెబుతూ ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన వీడియో పూర్తి రూపాన్ని బహిర్గతం చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. పోలీసులు ఎడిట్ చేసిన దృశ్యాలను మాత్రమే విడుదల చేశారని, కస్టడీలో తాను ఎదుర్కొన్న మానసిక వేధింపులు, హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరిగిన నిరసన సందర్భంగా దీప్కేతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న సమయంలో తన నానమ్మ మరణించిన విషయాన్ని పోలీసులు తెలియజేసినా, కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. న్యాయవాదిని సంప్రదించే హక్కును కూడా నిరాకరించారని తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తన ఫోన్ను ఉపయోగించేందుకు అనుమతించాలని పలుమార్లు కోరినా పోలీసులు అంగీకరించలేదని దీప్కే పేర్కొన్నారు. కస్టడీలో పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు రావడంతోనే నానమ్మ మరణవార్త తెలియజేస్తున్న వీడియోను విడుదల చేశారని ఆరోపించారు. విడుదల చేసిన వీడియోలో మహిళా పోలీసు అధికారి నానమ్మ మరణవార్తను తెలియజేస్తూ, స్వగ్రామానికి వెళ్లేందుకు సహాయం చేస్తామని చెప్పిన దృశ్యాలు ఉన్నాయి. అయితే, తన తండ్రితో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వని పరిస్థితుల్లో ఆ సహాయం వల్ల ప్రయోజనం ఏమిటని దీప్కే ప్రశ్నించారు. పోలీసులు తమ వాదన నిజమని నిరూపించాలనుకుంటే, కస్టడీకి సంబంధించిన పూర్తి వీడియోను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.






కామెంట్లు (0)