Magazines

లంచం తీసుకుంటూ ఇద్దరు మహిళా అధికారులు అరెస్ట్‌

1 గంట క్రితం

Two female officers arrested for taking bribe
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: అవినీతిపై తెలంగాణ ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఇద్దరు మహిళా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, జీహెచ్‌ఎంసీ మెహిదీపట్నం జోన్‌ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ తులసీరామ్‌ సునీత ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న స్వర్ణకుమారి ఎల్‌బీనగర్‌లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ కేంద్రంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు, కొత్త లైసెన్స్‌ జారీ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.


ఇందులో భాగంగా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ ద్వారా రూ.లక్ష స్వీకరించి, తన ప్రైవేట్‌ డ్రైవర్‌ మద్దూరి కృష్ణయ్యకు అప్పగించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నగదుతో వెళ్తున్న కృష్ణయ్యను పట్టుకున్నారు. అనంతరం స్వర్ణకుమారి నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్వర్ణకుమారితో పాటు శ్రీనివాస్‌, కృష్ణయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఘటనలో జీహెచ్‌ఎంసీ మెహిదీపట్నం జోన్‌లో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తులసీరామ్‌ సునీత నిర్మాణ అనుమతుల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ తెలిపింది.


ముందుగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద లెక్కల్లో చూపని మరో రూ.2.50 లక్షల నగదును గుర్తించి, మొత్తం రూ.6.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి నివాసంలో సోదాలు నిర్వహించారు. రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్