చర్య తీసుకోండి..

– లేకపోతే మేమే ఆ పనిచేస్తాం : సుప్రీం
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన దృశ్యాలు బుధవారం సాయంత్రం ట్విటర్‌ సహా సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. బాధ్యులపై చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ప్రభుత్వానికి సూచించారు. ఈ ఘటన తనను కలవరపరచిందని అంటూ వీడియోను ప్రదర్శించడం రాజ్యాంగ వైఫల్యమేనని
వ్యాఖ్యానించారు. ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని చెప్పారు. నిందితులపై తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే తామే తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. జాతి కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసాకాండను ప్రేరేపించేందుకు మహిళలను సాధనాలుగా వాడుకోవడం ప్రజాస్వామ్య దేశంలో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. సంఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నివేదికలను కోరుతూ దీనిపై ఈ నెల 28న విచారణ జరుపుతామని చెప్పారు. కాగా మణిపూర్‌ ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మణిపూర్‌ డీజీపీని ఆదేశించింది.

ఎట్టకేలకు పెదవి విప్పిన ప్రధాని పార్లమెంట్‌ వెలుపల మీడియా ముందుకు..
మణిపూర్‌ హింసపై ఇన్ని రోజులుగా మౌనదీక్షలో గడిపిన ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు స్పందించారు. అయితే ఇప్పుడు కూడా ఆయన కేవలం మణిపూర్‌ ఘటన పైనే వ్యాఖ్యానించలేదు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను కూడా జత కలిపి ప్రస్తావించారు. వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ వెలుపల ఆయన మాట్లాడుతూ తన హృదయం బాధతో, ఆగ్రహంతో నిండిపోయిందని చెప్పారు. ఏ పౌర సమాజానికి అయినా ఇది సిగ్గుచేటైన ఘటన అని అన్నారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాలలో శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ‘అది రాజస్థాన్‌ కావచ్చు…ఛత్తీస్‌గఢ్‌ లేదా మణిపూర్‌ కావచ్చు. నాయకులు రాజకీయాలకు అతీతంగా మహిళలు గౌరవించబడేలా చూసుకోవాలి’ అని హితవు పలికారు. అయితే కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాలలో మణిపూర్‌ లాంటి హింసాకాండ చోటుచేసుకోలేదన్న వాస్తవం ఇక్కడ గమనార్హం.
మోడీ మౌనమే కారణం : కాంగ్రెస్‌
మోడీ మౌనం, చేతకానితనం కారణంగానే మణిపూర్‌లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దుండగుల చేతిలో పెట్టిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో మానవత్వం చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని, ఏం జరుగుతోందో జాతికి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మౌనాన్ని దేశం ఎన్నటికీ క్షమించదని అన్నారు. రాజ్యాంగ బాధ్యతలను మోడీ గాలికి వదిలేశారని విమర్శించారు.
అమానవీయం, ఆటవికం : మమత
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆటవిక చర్యగా అభివర్ణించారు. దేశం యావత్తు ఒక తాటిపై నిలబడి ఇటువంటి అమానుషమైన ఘటనలను ఖండించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆ సమయంలో బాధిత మహిళల మనోవేదన, బాధ మాటల్లో చెప్పలేనిదని అన్నారు. ఈ సంఘటనను కప్పిపుచ్చేందుకు కాషాయ శిబిరం ప్రయత్నాలు చేస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది.
కేంద్రానిదే బాధ్యత : కేజ్రివాల్‌
మణిపూర్‌లో పరిస్థితులకు కేంద్రమే కారణమని, ఇటువంటి ఘటనలపై ప్రధాని మోడీ మౌనంగా వున్నారంటే ఆయన బలహీన నేత అని అర్ధమవుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ విమర్శించారు. రెండు మాసాలకు పైగా రాష్ట్రంలో హింస చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడం అత్యంత సిగ్గుచేటైన విషయమని అన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి ముందుగా అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ఈనాడు ప్రధాని స్పందిస్తూ ఈ ఘటన పట్ల ఆగ్రహంతో వున్నానని చెప్పారు. ఈ కోపాన్ని వ్యక్తం చేయడానికి 77 రోజులు పట్టిందా అని ఆప్‌ ప్రశ్నించింది.
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రుల విమర్శ
ఇదొక కించపరిచే చర్య అని మేఘాలయ ముఖ్యమంత్రి సి.సంగ్మా వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నపుడు మౌనంగా వుండడం సమస్యకు పరిష్కారం కాదని మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌తంగా అన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి సంఘటనలను మన సమాజం సహించలేదన్నారు.
దిగ్భ్రాంతి కలిగించే ఘటన అని జేడీయూ అధ్యక్షులు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఇదొక దురదృష్టకరమైన సంఘటన అని మాజీ సిజెఐ రంజన్‌ గగోరు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రధాని మౌనం వీడినందుకు సంతోషమని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ వ్యాఖ్యానించారు.
యావత్‌ దేశం ఆందోళన చెందుతోంది : మాయావతి
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు ఇంతలా దిగజారిపోయినా బిజెపి ఇంకా అటువంటి ముఖ్యమంత్రిని కాపాడేందుకు ప్రయత్నిస్తుందా? అని ఆమె ప్రశ్నించారు. దేశం యావత్తు ఈ ఘటనపై తీవ్రంగా ఆందోళన చెందుతోందని అన్నారు.
బీజేపీ ఓటు రాజకీయాలే ఇవి : అఖిలేశ్‌ యాదవ్‌
మణిపూర్‌లో పరిస్థితులకు బీజేపీ ఓటు రాజకీయాలే కారణమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. మణిపూర్‌ వీడియోతో విపరీతమైన, అల్లకల్లోలమైన అంశాలు బయటపడ్డాయని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి అన్నారు. పార్లమెంట్‌లో మణిపూర్‌ వీడియోపై చర్చ జరగాలని శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రాధాన్యతనివ్వాలని శరద్‌పవార్‌ కోరారు. అమానవీయమైన ఈ ఘటనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. మణిపూర్‌ ముఖ్యమంత్రితో మాట్లాడారు.

Spread the love