నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అభినయ్ కింగర్ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో కోలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
‘అరుముగ్’, ‘ఆరోహణం’, ‘సక్సెస్’ వంటి పలు చిత్రాల్లో నటించి అభినయ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరిసారిగా ‘వల్లవనుక్కు పుల్లుం ఆయుధం’ అనే చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో నటనకు పూర్తిగా దూరమై చికిత్స తీసుకుంటున్నారు. కాగా, తన మరణాన్ని ముందే ఊహించినట్లుగా మూడు నెలల క్రితం అభినయ్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో వైద్యులు తాను కేవలం ఏడాదిన్నర మాత్రమే జీవిస్తానని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో విడుదలైన కొంత కాలానికే ఆయన మరణించడం అందరినీ కలచివేస్తోంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



