నవతెలంగాణ – హైదరాబాద్: గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని అక్టోబర్ 14వ తేదీన జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఆమోదించనుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ అన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ – గాజా యుద్ధాన్ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని భారత ప్రభుత్వాన్ని స్టాలిన్ కోరారు. బుధవారం గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను నిరసిస్తూ ఎగ్మోర్‌లోని రాజారత్నం స్టేడియం సమీపంలో సిపిఐ(ఎం) నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు సిఎం ఎం.కె స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే తీర్మానం తమిళనాడు ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుంది. రాజకీయ పంథాలకు అతీతంగా అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు ఇస్తాయని నేను ఆశిస్తున్నాను’ అని అన్నారు.
అంతర్జాతీయ హక్కులు, ఐక్యరాజ్యసమితి విధానాలను ఉల్లంఘించి ఇజ్రాయిల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్) గాజాపై విచక్షణారహితంగా బాంబు దాడి చేయడం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఇజ్రాయిల్ చేస్తున్న సామూహిక హత్యలను ఖండించారు అని స్టాలిన్ అన్నారు. గాజాపై జరిగిన దాడుల్లో 11 వేల మంది మహిళలు, 17 వేలమంది చిన్నారులు, 175 మంది జర్నలిస్టులు, 125 మంది ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు చనిపోయారు. 26 వేల మంది చిన్నారులు తమ తల్లిదండ్రులుల్ని కోల్పోయారు. లక్షమందికిపైగా ప్రజలు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాజాలో ఎక్కువ భాగం పూర్తిగా నాశనమైంది. అయినప్పటికీ పాలస్తీనా ప్రజలు ఇజ్రాయిల్ దండయాత్రను ప్రతిఘటిస్తూనే ఉన్నారు అని స్టాలిన్ ఈ నిరసన కార్యక్రమంలో చెప్పారు. ఆఖరుకు ఆహారం కోసం ఎదురుచూస్తున్న 45 మందిని ఐడిఎఫ్ చంపిందందని తెలిసి.. ప్రపంచ మానవాళి మండిపడింది. 47 దేశాల నుండి పాలపొడి, ఆహారం, సహాయ సామాగ్రిని తీసుకువెళుతున్న స్వచ్ఛంద సేవలకులను సైతం ఇజ్రాయిల్ సైన్యం అరెస్టు చేసింది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి మరీ ఇజ్రాయిల్ చేస్తున్న ఈ చర్యలను ఖండించకుండా మనం మౌన ప్రేక్షకులుగా ఉండగలమా? అని ఆయన ప్రశ్నించారు.
ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావడానికి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని భారత ప్రభుత్వాన్ని స్టాలిన్ కోరారు. ప్రపంచ శాంతి, మానవ హక్కులు సార్వత్రికమైనవి. మానవజీవితం అమూల్యమైనది. దానిని కాపాడుకోవడం మన బాధ్యత అని స్టాలిన్ అన్నారు. పాలస్తీనా ప్రజలకు ఆహారం, మందులు సహా అవసరమైన సామాగ్రిని అందించాలని స్టాలిన్ పిలుపినిచ్చారు. పాలస్తీనియన్ ప్రజల కోసం పునరావాసాన్ని కల్పించాలని, విధ్వంసమైన గాజా యొక్క పునర్నిర్మాణం చేపట్టాలని ఆయన నొక్కి చెప్పారు. ఖైదీలందరినీ విడుదల చేయాలని ఆయన కోరారు.
సిపిఐ(ఎం) చేపట్టిన నిరసన కార్యక్రమంలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సెల్వపెరుంతగై, సిపిఐ(ఎం) నేతలు పి. షణ్ముగం, కె. బాలకృష్ణన్, యు. వాసుకి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, మణితనేయ మక్కల్ కట్చి నేత ఎం.హెచ్ జవహిరుల్లా తదితరులు పాల్గొన్నారు.
గాజాలో కాల్పుల విరమణ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించనుంది : ఎం.కె స్టాలిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES