నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై జ్ఞానేశ్ కుమార్ శుక్రవారంనాడు సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించాలని పలు పార్టీలు సూచించినట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) తెలిపారు. వారి విజ్ఞప్తులను వివిధ కోణాల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే దీనిపై ఒక స్పష్టత ఇస్తామని అన్నారు.ఇటీవల కాలంలో ఏమాత్రం పొరపాట్లకు తావీయకుండా బీహార్ ఎన్నికలు జరిగాయని, అంతకు మించి మరింత మెరుగ్గా తమిళనాడులో ఎన్నికలు నిర్వహిస్తామని, సరికొత్త రికార్డు సృష్టిస్తామని తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన ఏడు రోజుల వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వీవీపాట్ల స్లిప్పులను వెరిఫై చేసుకోవడానికి అభ్యర్థులను అనుమతిస్తామని సీఈసీ తెలిపారు. అయితే ఇందుకు కొంత మొత్తం చెల్లించాలని అన్నారు. ఈవీఎం రౌండ్లకు ముందు పోస్టల్ బ్యాలెట్లను రెండు రౌండ్లు కౌంటింగ్ జరుపుతామని చెప్పారు.
తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 188 జనరల్, 44 షెడ్యూల్డ్ కులాలకు, 2 షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి.



