నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. వరుస పర్యటనలతో కాంగ్రెస్ పార్టీలో, ఇండియా కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్నారు. తాజాగా ఆయన ఈరోజు చెన్నైలో పర్యటించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న “మహా విద్యా చైతన్య ఉత్సవ్” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.
ఈ పర్యటనకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది. బీహార్ రాజధాని పాట్నాలో నిన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో బీహార్, వచ్చే ఏడాది తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.