Thursday, May 15, 2025
Homeఎడిట్ పేజిటార్గెట్లూ- టార్చర్లూ!

టార్గెట్లూ- టార్చర్లూ!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాల సమయంలో అనేక వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిని నిర్వహిం చొద్దంటూ హైకోర్టు నుంచి ఆదేశాలు, పోలీసుల నుంచి హెచ్చరికలు వస్తుంటాయి. కానీ వాటిల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవు. యదేచ్ఛగా పందాలు కొనసాగుతాయి. మరుసటిరోజే టీవీల్లో, పేపర్లలో వార్తలొస్తాయి. కానీ వాటిపై ఎవరూ చర్యలు తీసుకోరు. ఇప్పుడు ఇదేవిధంగా ఉన్నాయి ప్రయివేటు, కార్పొరేట్‌ కళాశాలల తీరూతెన్నులు. వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దు, పిల్లలను ఒత్తిడికి గురిచేయొద్దంటూ ప్రభుత్వం, విద్యాశాఖ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. ఈ సంవత్సరం కూడా ఆ పరంపర కొనసాగింది. కానీ హైదరాబాద్‌ సహా జిల్లాలు, మండల కేంద్రాల్లోని అనేక ప్రయివేటు, కార్పొరేట్‌ కాలేజీలు సర్కారు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. వార్షిక పరీక్షలు ముగిసిన ఏప్రిల్‌లోనే మళ్లీ పైతరగతుల క్లాసులను ప్రారంభించాయి. ప్రారంభించటమే గాదు… అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశా లలకు ఫోన్లు చేసి, అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలంటూ లెక్చరర్లను, సిబ్బందిని అవి ఆదేశించటం గమనార్హం.
ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయా కాలేజీలు.. మరోవైపు తమ వద్ద పనిచేసే అధ్యాపకులు, సిబ్బంది మెడపై మరోకత్తిని వేలాదీయటం కలవరపాటుకు గురిచేస్తోంది. ‘మీ ఉద్యోగాలు ఉండాలంటే కచ్చితంగా మేం చెప్పిన పనులు చేయాల్సిందే. ఒక్కొక్కరు ఇంటింటికీ తిరిగి పిల్లలను పట్టుకుని రావాలి, అడ్మిషన్లు చేయించాలి, ఫీజులు వసూలు చేసే బాధ్యతను సైతం మీరే తీసుకోవాలి. అలాగని ఒకరో ఇద్దరో పిల్లల్ని తీసుకొస్తే సరిపోదు, కనీసంలో కనీసంగా ఓ పదిహేను మందిని కాలేజీల్లో చేర్పించాలి, లేదంటే మీదారి మీరు చూసుకోవాల్సి ఉంటుంది…’ అంటూ హుకూం జారీ చేయటం పరిపాటిగా మారింది. దీంతో ఏం చేయాలో పాలు పోక ప్రయివేటు అధ్యాపకులు, సిబ్బంది…తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు.
ఇది ఒకరకమైన వేధింపులైతే.. నాణేనికి రెండోవైపు ఇంకోరకమైన సాధింపులు కొనసాగుతుండటం అధ్యా పకులను మరింత ఒత్తిడిలోకి నెడుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్‌, ఎమ్‌సెట్‌, జేఈఈ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల ఘనతను తమ ఖాతాల్లో వేసుకుంటున్న యాజమా న్యాలు.. ఫెయిలైన విద్యార్థులు, మార్కులు, ర్యాంకుల్లో వెనుకబాటును మాత్రం లెక్చరర్ల వైఫల్యాలుగా చిత్రీకరిస్తూ వారిని ఆత్మనూన్యతాభావానికి గురి చేస్తుండటం విస్మయకరమైన అంశం. ఆ వైఫల్యాలకు వారిని బాధ్యులను చేస్తూ ఒక బ్రాంచి నుంచి మరోదానికి మారుస్తూ వారి జీవితాలతో ఆటాడుకుంటున్న దృష్టాంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి.
ఇవన్నీ ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యారంగంపై ప్రభుత్వ అజమాయిషీ కొరవడిన వైనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. నియమ నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆయా విద్యాసంస్థలు… తమకున్న పలుకుబడిని ఉపయోగించి, ఇష్టానుసారంగా రాజ్యాన్నేలు తున్నాయి. వేలమందికి అడ్మిషన్లు ఇస్తున్న పలు కార్పొరేట్‌ కాలేజీలు..కొన్ని వందల మందికి మాత్రమే మార్కులు, ర్యాంకులు తెప్పిస్తున్నాయనే విషయాన్ని మనం మరువరాదు. ఆ మార్కులు, ర్యాంకులనే పెద్దపెద్ద హోర్డింగుల ద్వారా ప్రచారార్భాటం చేసుకుంటూ వందల కోట్లను ఆయా సం స్థలు పోగేసుకుంటున్నాయి. మిగతా ఫెయిలైన విద్యార్థుల సంఖ్యను, ఆ సంగతిని ఏమాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తమ వైఫల్యాలను మరుగుపరుస్తున్నాయి.
ఇంత జరుగుతున్నా పాలకులు పట్టించుకోకపోవటం వారి నిష్క్రియాపరత్వం, నిర్లక్ష్యానికి నిదర్శనం. ఒకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామంటూ చెబుతూనే.. మరోవైపు కార్పొరేట్‌ కాలేజీలకు ఎర్ర తివాచీలు పరవటం వారికే చెల్లింది. మన రాష్ట్రంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మొన్నటి పది, ఇంటర్‌, ఎప్‌సెట్‌ ఫలితాల్లో ప్రభుత్వ బడులు, కళాశాలలు, గురుకులాలు… ప్రయివేటు, కార్పొరేట్‌కు ధీటుగా తమ సత్తా చాటాయి. ఈ నేపథ్యంలో వాటిని మరింత బలోపేతం చేయటం ద్వారా కార్పొరేట్‌ కబంధ హస్తాల నుంచి విద్యారంగాన్ని కాపాడాలి. ఉపాధ్యాయులు, అధ్యాపకుల మెడపై కత్తి పెట్టి, బోధనేతర పనులను అప్పగిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే నాణ్యమైన విద్యాబోధన సాధ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -