జీడీపీ అంచనాలకు ఏడీబీ కోత
ఈ ఏడాది 6.5 శాతమే
చెన్నరు : భారత వృద్ధి రేటు అంచనాలకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) కోత పెట్టింది. ఏడీబీ తన తాజా ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ నివేదికను విడుదల చేసింది. ఆ వివరాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ 6.5 శాతానికే పరిమితం కానుంది. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతంగా పేర్కొంది. అమెరికా ఇటీవల అమలు చేసిన టారిఫ్ విధానాలు భారత ఎగుమతులను ప్రభావితం చేయడమే ఈ తగ్గింపుకు ప్రధాన కారణం. అయినప్పటికీ.. బలమైన దేశీయ డిమాండ్, అనుకూల రుతుపవనాలు, దృఢమైన సేవల రంగం భారతదేశాన్ని ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబెడతాయని ఏడీబీ పేర్కొంది. వచ్చే ఏడాది 2026-27లో 6.7 శాతం వృద్ధి ఉండొచ్చని తెలిపింది.
ప్రధాన సవాళ్లు..
అమెరికా టారిఫ్‌లు, సరఫరా గొలుసు ఆటంకాలు భారత ఎగుమతులు, విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయి. కొత్త టారిఫ్‌లకు తోడు విధాన అనిశ్చితి ఎగుమతులను పరిమితం చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, సరఫరా గొలుసు ఆటంకాలు వృద్ధిని ప్రభావితం చేయనున్నాయి. టారిఫ్‌లు, విధాన మార్పులు విదేశీ పెట్టుబడులను ఆలస్యం చేయనున్నాయి. అయితే.. గ్రామీణ ఆదాయాల మెరుగుదల, మంచి వ్యవసాయ ఉత్పత్తి, ప్రభుత్వ మౌలిక సదుపాయ ఖర్చు బాహ్య ఒత్తిళ్లను తట్టుకోవడానికి సహాయపడతాయి. 2025-26లో ద్రవ్యోల్బణం 3.8 శాతంగా ఉండొచ్చు. మెరుగైన ఆహార ఉత్పత్తి వల్ల ధరలు తగ్గుముఖం పడతాయని ఏడీబీ అంచనా వేసింది. గ్లోబల్ పరిస్థితులు స్థిరపడితే పెట్టుబడి విశ్వాసం మెరుగు పడుతుందని విశ్లేషించింది. 2026లో ఆసియా 4.6 శాతం పెరగొచ్చు. ఇంతక్రితం ఈ అంచనా 4.7 శాతంగా ఉంది.
భారత వృద్ధికి టారిఫ్‌ల దెబ్బ
- Advertisement -
- Advertisement -