నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21,2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 19న ఇండియా కూటమి నేతలు సమావేశం కావాలని భావిస్తున్నాయి. ఆప్ తాజా నిర్ణయంతో ఇండియా కూటమి నిర్వహించబోతున్న సమావేశానికి హాజరుకాబోవడం లేదని ఆప్ చెప్పింది. ఇకపై ఇండియా కూటమిలో తాము భాగం కాదని ఆప్ వెల్లడించింది.
ఢిల్లీలో జరిగిన అసెంబ్లీలో ఒంటరిగానే పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల్లో బైపోల్ ఎన్నికల్లో ఆప్ ఎలాంటి పొత్తులు లేకుండా విజయం సాధించింది. పంజాబ్ లో తన స్థానాన్ని నిలబెట్టుకొని, గుజరాత్ ఓ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకొని బీజేపీకి సవాల్ విసిరింది. మరోవైపు రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ బయటకు రావడంపై రాజకీయ చర్చనీయాంశంగా మారింది.
గతేడాది అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఆప్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌తో సహా అన్ని యూపీఏ పార్టీ ఇండియా కూటమి పేరుతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. తాము గతేడాది లోక్‌సభ ఎన్నికల విషయంలో పనిచేసిన మాట వాస్తమే కానీ, ఇప్పుడు కూటమిలో లేము అని ఆప్ కుండ బద్ధలు కొట్టింది.